మంత్రి పదవి తొలగింపులో కుట్ర.. రేవంత్‌ రెడ్డి బ్లాక్‌మెయిల్‌!

మంత్రి పదవి తొలగింపులో కుట్ర.. రేవంత్‌ రెడ్డి బ్లాక్‌మెయిల్‌!
తనను మంత్రివర్గం నుండి తొలగించడంలో కుట్ర ఉందని, కొండల్‌ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కలిసి తనపై కుట్రలు చేసి కక్షసాధింపుగా మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కూతురు మాట్లాడిన మాటలను ఆయుధంగా మార్చుకున్నారని  ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పైగా, తనను తొలగించడం అధిష్ఠానానికి కూడా ఇష్టం లేదని, అయితే రేవంత్‌ రెడ్డి పట్టుబట్టి తనని బర్తరఫ్‌ చేయించారని, ‘బర్తరఫ్‌ చేస్తారా? నన్ను వెళ్లిపోమ్మంటారా’ అని అధిష్ఠానాన్ని బ్లాక్‌మెయిల్‌ చేశారని ఆమె ఆరోపించారు. అయితే, తనను తీసేసి తన వల్ల ముగ్గురు మహిళలకు పదవులు ఇచ్చారని, అందులో ముగ్గురు బీసీలకు పదవులు రావడం సంతోషం అని ఆమె చెప్పారు. పద్మశాలీలకు, మున్నూరు కాపులకు పదవులు దక్కాయని తెలిపారు.
 
తాను తప్పు చేయలేదని, తనకు పశ్చాత్తాపం లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె హితవు పలికారు. వైఎస్‌ఆర్‌ తర్వాత రేవంత్‌ రెడ్డినే ఎక్కువ అభిమానించానని, రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు, సీఎం కావాలని తానే ముందు కోరుకున్నానని ఆమె గుర్తు చేశారు.
 
“నన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడాన్ని ఖండిస్తున్నా. రాజీనామా చేయమని నన్నెవరూ అడగలేదు. నా వివరణ వినకుండా నేరుగా తొలగించటం సరికాదు. నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సింది. నా కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?. నేను తప్పు చేయలేదు. నాకు పశ్చాత్తాపం లేదు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి.  నాపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నా” అని ఆమె తెలిపారు.
 
కాగా, పోలీసులపై ఒత్తిడి తెచ్చి తన మాజీ ఓఎస్డీ సుమంత్‌ అనుచరులను అరెస్ట్ చేశారని కొండా సురేఖ ఆరోపించారు. సుమంత్‌పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తాను పార్టీకి రాజీనామా చేయడం లేదని, కాంగ్రెస్‌లో ఉంటానని, ఇకపై ఎమ్మెల్యేగా కొనసాగుతానని, నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.
 
 “సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీపై నేను ఎలాంటి విమర్శలు చేయలేదు.  మల్లు రవి కూడా ఒకప్పుడు కాంగ్రెస్‌ను తిట్టారు. మాజీ సీఎం రోశయ్య, జైపాల్‌రెడ్డి కూడా ఇందిరాగాంధీని తిట్టారు. నా కుమార్తె వ్యాఖ్యలకు నాపై చర్యలు తీసుకోవటం బాధాకరం. రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నారని తిట్టినవారికి పదువులు ఇచ్చారు. నన్ను తొలగించినందుకు ఏమీ బాధపడటం లేదు. కారణం చెప్పకుండా తొలగించడమే చాలా బాధాకరం. బీసీ మహిళను ఇలా అవమానకరంగా తొలగించటం బాధాకరం. కారణం చెప్పకుండా తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కారణం చెప్పాల్సిన బాధ్యత సీఎం, ఏఐసీసీపై ఉంది”  అని సురేఖ స్పష్టం చేశారు. 
 
మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని, తన ప్రమేయం లేకుండానే తన శాఖలో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండా తన ఓఎస్‌డీ సుమంత్‌ను తప్పించారని, అభివృద్ధి విషయంలో తన నియోజకవర్గంపై వివక్ష చూపారని విమర్శించారు. తన శాఖలోని అంశాలపై కడియం శ్రీహరి జోక్యం చేసుకున్నారని, తన శాఖలోని అధికారులతో కడియం సమీక్షలు నిర్వహించారని తెలిపారు.
 
“నన్ను అడగకుండానే బర్తరఫ్‌ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులంతా హ్యాపీగా ఉన్నారా? గుండెలపై చేయి వేసుకుని చెప్పాలి. మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు. ఈరోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి. మనం ఇస్తామన్న హామీలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలి” అంటూ ఆమె సహచర పార్టీ నేతలను హెచ్చరించారు.