జి.కిషన్ రెడ్డి
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి
ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. వెయ్యి రోజులు పూర్తయినా ఆ హామీ ఏమైందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ఎన్నికలు వచ్చినపుడు.. మహిళలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవడం తప్ప వాళ్లకు ఇచ్చిన ఏ మాటనైనా నిలబెట్టుకోలేదు. అందుకే ఒక్కో మహిళకు రూ. 80 వేలకు పైగా బాకీ పడిన చీటింగ్ సర్కార్ గా చరిత్రలో నిలిచిపోతుంది. కాలేజీకి వెళ్లే ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని మోసం చేశారు.
వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారు. తెలంగాణలోని వృద్ధులు, వితంతువులు అడుగుతున్న ఒక్క ప్రశ్న రూ.4,000 పెన్షన్ ఎక్కడ? దీనికి రేవంత్ సమాధానమేంటి? ఇది వితంతువులను, వృద్ధులను చీటింగ్ చేసిన సర్కార్.
పేద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు. ఇదీ చీటింగ్ కాదా? ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామన్నారు. కానీ ఉన్న పాఠశాలలనే సక్రమంగా నిర్వహించలేక మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు. గురుకులాల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనల్లో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. దీనికితోడు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.14వేల కోట్లకు పేరుకుపోయినా పట్టించుకోకుండా చీటింగ్ చేస్తున్న సర్కార్ ఇది.
రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. చాలామంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి, కిస్తీలు ఎగ్గొట్టి, గుర్తొచ్చినప్పుడల్లా కొంత డబ్బు విడుదల చేసి రైతులకు ఏదో గొప్ప ఉపకారం చేసినట్లు ప్రచారం చేసుకుంటోంది. 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వరికే అన్నారు. ఇప్పుడు సన్నబియ్యానికే అని చెప్పినా.. అది కూడా ఇవ్వకుండా నిట్టనిలువునా రైతులను ముంచేశారు.
ఎన్నికల ముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో మాట.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ రైతు ప్రభుత్వం? ఇది రైతులను చీట్ చేసిన సర్కారు తీరు. భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి ఒక ఎకరానికి రూ.15వేలు ఇస్తామని, రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని చెప్పారు. ఈ పెండింగ్ బకాయిలే దాదాపు రూ. 57వేల కోట్లున్నాయి. వీటిని ఇవ్వకుండా రైతులను చీటింగ్ చేస్తున్నారు.
ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చి భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కానీ భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను తమ భూములపైనే హక్కుల కోసం తిరిగే పరిస్థితికి నెట్టారు. భూమి సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టడం.. చీటింగ్ కాదా?
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లిదండ్రులు లేదా భార్యకు నెలకు రూ.25 వేల పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. వెయ్యి రోజుల్లో ఎంతమంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి పింఛన్లు ఇచ్చారు? తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. అమరవీరులను చీటింగ్ చేయడం నిజం కాదా?
తెలంగాణ ఉద్యమకారులకు అధికారిక గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. గుర్తింపు కమిటీలు, సమావేశాల పేరుతో కాలయాపన చేయడం తప్ప ఇప్పటివరకు ఏం చేశారు? ఉద్యమకారులను కూడా ఓట్ల కోసం మాత్రమే గుర్తు చేసుకుంటారా? ఇది తెలంగాణ ఉద్యమకారులను చీటింగ్ చేయడమే.
‘విద్యాజ్యోతులు’ పథకంతో పదో తరగతి పూర్తి చేసుకున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.10 వేలు, ఇంటర్ పూర్తి చేసుకున్న వారికి రూ.15 వేలు, డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి రూ.25 వేలు, పీజీ పూర్తి చేసుకున్న వారికి రూ.లక్ష, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి.. వారిని కూడా చీట్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కుటుంబానికి రూ.12లక్షలు ఇస్తామన్న ‘అంబేడ్కర్ అభయహస్తం’ విషయంలోనూ పూర్తిగా మోసం చేశారు.
ప్రతి మండలానికి ఎస్సీ, ఎస్టీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఈ ఊసే ఎత్తడంలేదు. గిరిజన తండాలు, గూడెం పంచాయతీలకు ‘సమ్మక్క, సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం’ కింద ఏటా రూ.25 లక్షల గ్రాంటు విడుదల చేస్తామని చెప్పి ఓట్లేయించుకుని.. వారిని మోసం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలు ఉన్నప్పుడే హామీలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు దగ్గరపడితే ‘రేపటి నుంచే అమలు’ అంటూ ప్రకటనలు. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ అదే సాకులు, అదే కాలయాపనతో చీటింగ్ చేస్తున్నారు. వెయ్యి రోజుల్లో తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చింది ఏమిటి? హామీల అమలుకు బదులు హామీలపై కొత్త అబద్ధాలేనా?
ఒక ప్రభుత్వానికి వెయ్యి రోజులంటే.. ఇదేమీ తక్కువ సమయం కాదు. ఈ వెయ్యి రోజుల్లో.. తెలంగాణలోని ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇది కేవలం హామీల వైఫల్యం మాత్రమే కాదు. ప్రజలకు చేసిన నమ్మకద్రోహం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ప్రచారాలు, ప్రకటనలు, సాకులు పక్కనపెట్టి వెయ్యి రోజుల్లో ఎన్ని హామీలు పూర్తిగా అమలు చేశారో, ఎన్ని హామీలు పెండింగ్‌లో ఉన్నాయో, ఎన్ని హామీలను వదిలేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి.
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ‘ప్రజా ప్రభుత్వం’ కాదు, తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిన ‘420 ప్రభుత్వం’. హామీలను నెరవేర్చకుండానే.. రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయడంలో నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ఒకేలా ఉంది. ఇవాళ్టికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వెయ్యి రోజులు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రజలు మిగిలిన 825 రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలనే స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు.

More Stories
రామ మందిరం సీఈఓ కావడం శ్రీ రాముడి ఆశీర్వాదం
అమెరికా, చైనా, భారత్ నుండి పరిహారం కోరుతున్న నేపాల్
ఇరాన్‌కు రష్యా సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ టెక్నాలజీ