* పిరికిపంద చర్యలు అంటూ తెలంగాణ బిజెపి నాయకుల మండిపాటు
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నివాసంలతో పాటు పలు చోట్ల బిజెపి కార్యాలయాలపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం పట్ల బిజెపి నాయకులు ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. అత్యంత పిరికిపంద చర్య అని తీవ్రంగా ఖండించారు.
బిహార్‌లో విద్యార్థులపై కాల్పులు, జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకారులపై లాఠీచార్జి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు, రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు ఘటనలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ ప్రధాన గేటుకు నల్ల రంగు పూసి.. అమిత్‌షా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.
ఒక దశ లో బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకవైపు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తుండగా, మరోవైపు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, 20 మంది కార్యకర్తలు బయటకు వచ్చి కాంగ్రెస్ జెండాలను దహనం చేశారు. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ నాయకుడు శివచరణ్ రెడ్డి, అతని వెంట ఉన్న వారిని అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరగంట తరువాత బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండా గణేష్, కొందరు కార్యకర్తలు గాంధీ భవన్‌ను ముట్టడించడానికి వెళ్లగా..పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా తమ వెంట తెచ్చుకున్న కోడిగుడ్లను గాంధీభవన్ వైపు విసిరారు.
చివరకు కుండా గణేష్‌తోపాటు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల వద్ద బారికేడ్లు, పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు నల్లగొండ శ్రీనగర్‌లో కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లి టమాటాలు, కోడిగుడ్లు విసిరేశారు. కార్యాలయం ఎదుట ఉన్న కటౌట్‌ను చించివేసి ఫ్లెక్సీ, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ సమయంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ లేరు. దాడి ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జోలికొస్తే కాంగ్రెస్ కార్యాలయాలను తగులబెడుతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ప్రతిగా ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో వందలాది మంది బీజేపీ కార్యాలయ ముట్టడికి వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు చించివేశారు. మరోవైపు.. దేవరకొండ రోడ్డులో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లోని సామగ్రి, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు గడియారం సెంటర్‌లో ఆందోళనకు దిగారు. శంకర్‌నాయక్ మాట్లాడుతూ వర్షిత్ రెడ్డిని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు.
అధికారం అడ్డంపెట్టుకుని ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగడం, ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాకుండా వృద్ధురాలైన వర్షిత్ రెడ్డి తల్లిని గాయపరచడం కాంగ్రెస్ పాలకుల దివాళాకోరుతనానికి నిదర్శనమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంయమనాన్ని చేతగానితనంగా భావించి, కార్యకర్తల జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, 22ఏ భూముల కుంభకోణాలు, కమిషన్ల దందాలపై బీజేపీ నిలదీస్తుండటంతో ఓర్వలేకనే, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ఈ విధ్వంసక రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు. బీజేపీ ఎప్పుడూ ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉంటుందని, అంతమాత్రాన తమ సంయమనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు.
భవిష్యత్తులో బీజేపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేస్తూ, రాష్ట్ర కార్యాలయంపై, వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన రౌడీలపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి పిరికిపంద చర్య అని ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ ప్రతిని చేతబట్టి నీతి సూక్తులు వల్లించే, డూప్లికేట్ గాంధీ ఈ దాడి పై స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనానికి, నీచ రాజకీయాలకు నిదర్శనమని ఆమె ధ్వజమెత్తారు.
యువత బీజేపీ వైపు మొగ్గుచూపుతుండటాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు దిగజారుడు కుట్రలకు పాల్పడుతోందని ఆయన తీవ్రంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై నల్ల రంగులు చల్లడం, నాయకుల నివాసాలను ముట్టడించేందుకు యత్నించడం, ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడులకు పథకరచన చేయడం కాంగ్రెస్ అనుబంధ విభాగాలైన ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ అవివేకానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
ఎక్కడో బీహార్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన ఘటనలను పట్టుకుని, అబద్ధాలు ప్రచారం చేస్తూ, సంబంధం లేని విషయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా డిమాండ్ చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. బీజేపీ సంయమనం పాటిస్తోందని, ఒకవేళ తమ కార్యకర్తలు తిరగబడి ధీటుగా సమాధానం చెబితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో రోడ్ల మీద కూడా తిరగలేరని స్పష్టం చేశారు.
బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తుంటే పోలీసులు తమాషా చూస్తున్నా రా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఘటనపై వివరణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. బీజేపీ కార్యాలయంపై దాడి కాంగ్రెస్ అరాచకాలకు నిదర్శనమని ఆ పార్టీ నేత డా. కె. లక్ష్మణ్ విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని పేర్కొంటూ రాష్ట్రంలో ‘గుండా రాజ్యం’ నడుస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి రాష్ట్రంలో నెలకొన్న అరాచకానికి, గూండా రాజ్యానికి’ ప్రత్యక్ష నిదర్శనమని ఆయన విమర్శించారు.
ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు తెలపడానికి ఒక పద్ధతి ఉంటుందని, కానీ ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా జాతీయ పార్టీ కార్యాలయంపై భౌతిక దాడులకు దిగడం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ఇలాంటి భౌతిక దాడుల ద్వారా బిజెపిని భయపెట్టాలని చూడటం అవివేకమని ఆయన స్పష్టం చేశారు. ఆఫీసులపై దాడులు చేసినంత మాత్రాన బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో పూర్తి స్థాయి హోంమంత్రి లేకపోవడం వల్లే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగే వరకు పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులు, కార్యాలయాలపై దాడులు చేయించే సంస్కృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే బాధ్యత వహించి సమాధానం చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
More Stories
7.8 శాతం పెరిగిన జిడిపి… అద్భుతంగా అభివర్ణించిన ప్రధాని మోదీ
అంతులేని యుద్ధాల నుండి యుద్ధ ముగింపు వైపు పయనించాలి
ఇథనాల్ శాతాన్ని వెల్లడించాలని కోరే పిటిషన్ తిరస్కరించిన `సుప్రీం’