భారత వైమానిక దళం (ఐఏఎఫ్) రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో ఐదు ఎస్-400 ‘సుదర్శన్’ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్క్రాడ్రన్ల కొనుగోలుకు భారత్ జారీ చేసిన టెండర్‌కు రష్యా స్పందించింది. తాజాగా రష్యా ప్రభుత్వం తమ నుంచి పూర్తి స్థాయి ప్రతిపాదనను భారత రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించింది.
మొత్తం సుమారు రూ.50 వేల కోట్లకు పైగా విలువైన ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రస్తుతం భారత రక్షణ వర్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. భారత్ ఇప్పటికే రష్యా నుంచి ఐదు ఎస్-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసేందుకు గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు నాలుగు స్క్వాడ్రన్లు భారత్‌కు అందాయి. ఐదో స్క్వాడ్రన్‌ను ఈ ఏడాది నవంబర్ నాటికి అందించే అవకాశం ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి.
కొత్తగా కొనుగోలు చేయనున్న ఐదు ఎస్-400 స్క్వాడ్రన్లకు సంబంధించిన టెండర్‌కు రష్యా ప్రతిపాదన అందిన నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ దానిని ప్రాసెస్ చేస్తుంది. కొత్త ఒప్పందం కుదిరితే డెలివరీలు ప్రారంభం కావడానికి సుమారు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అదనంగా కొనుగోలు చేసే ఎస్-400 యూనిట్లను భారతదేశంలోని తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఉంది. దీంతో దేశ రక్షణ వ్యవస్థలో వైమానిక రక్షణ సామర్థ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలే టార్గెట్‌గా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఈ ఎస్- 400 గగనతల క్షిపణ వ్యవస్థ కీలక పాత్ర పోషించినట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన నిఘా, యుద్ధ విమానాల్ని అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ అత్యంత ప్రభావవంతంగా పనిచేసిందని అధికారులు తెలిపారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్ ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రా ఇటీవల ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో ఎస్- 400 సామర్థ్యాల గురించి వివరించారు.
సరిహద్దులకు దాదాపు 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన ఒక నిఘా విమానాన్ని ఎస్- 400 వ్యవస్థ నేలకూల్చిందని చెప్పారు. ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాన్ని కూల్చివేసిన అత్యంత సుదూర దాడుల్లో ఇప్పటివరకు ఇదే ముందుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే చైనాలో తయారై పాకిస్థాన్‌కు అందించిన జె-10 ఫైటర్ జెట్లతో పాటు పలు శత్రు విమానాలను ఇది విజయవంతంగా కూల్చివేసిందని ఎయిర్ మార్షల్ మిశ్రా వెల్లడించారు.

More Stories
రహస్యంగా ‘డార్క్ షిప్’ ద్వారా రష్యాకు భారత ఇంధనం
దీర్ఘకాలిక యురేనియం సరఫరాకు భారత్, ఉజ్బెకిస్థాన్ అంగీకారం
మూడు రకాల ‘ఎవరెస్ట్’ మసాలాలపై నిషేధం!