గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌లో చాంపియన్‌గా ప్రజ్ఞానంద

గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌లో చాంపియన్‌గా ప్రజ్ఞానంద
‘గ్రాండ్ చెస్ టూర్ 2026’ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచి భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద రమేష్‌బాబు చరిత్ర సృష్టించారు. ఫైనల్‌లో ఫాబియానో ​​కరువానాను 15-13 తేడాతో ఓడించి ప్రగ్ ఈ టోర్నమెంట్‌ను కైవసం చేసుకున్నారు. సెయింట్‌ లూయిస్‌లో భారత కాలమానం గురువారం తెల్లవారుజామున జరిగిన గ్రాండ్‌ చెస్‌ టూర్‌ (జీసీటీ) ఫైనల్స్‌లో 21 ఏండ్ల ఈ చెన్నై చిన్నోడు.. 15-13తో అమెరికా జీఎం ఫాబియానొ కరువానాను చిత్తుచేశాడు.
తద్వారా భారత్‌ తరఫున ఈ టైటిల్‌ గెలిచిన తొలి చెస్‌ ప్లేయర్‌గా అతడు రికార్డులకెక్కాడు. ఫైనల్స్‌లో భాగంగా రెండు క్లాసికల్‌ గేమ్స్‌లో ఒక్కదాంట్లో కూడా నెగ్గకున్నా ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ విభాగాల్లో తనదైన ఎత్తులతో పావులు కదిపిన ప్రజ్ఞా.. ప్రత్యర్థికి ఊహకందని కమ్‌బ్యాక్‌తో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో అతడు 2 లక్షల యూఎస్‌ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు ఒక కోటి తొంబై లక్షల రూపాయలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు. 
 
కాగా మూడో స్థానం కోసం జరిగిన పోరులో అమెరికాకే చెందిన వెస్లీ జర్మనీ జీఎం విన్సెంట్‌ కీమర్‌పై విజయం సాధించాడు. ఈ ముగ్గురూ (ప్రజ్ఞానంద, కరువానా, వెస్లీ) వచ్చే ఏడాది జీసీటీకి నేరుగా అర్హత సాధించారు.

“నిజం చెప్పాలంటే.. ఈరోజు నాకు గెలిచే అవకాశాలు వస్తాయని అస్సలు ఊహించలేదు. ఆరు పాయింట్లు వెనుకంజలో ఉండి కూడా టైటిల్‌ సాధించానంటే నమ్మశక్యంగా లేదు. కరువానా లాంటి అగ్రశ్రేణి ఆటగాడిపై ఒక్క గేమ్‌ నెగ్గడమైనా కష్టమే. అలాంటిది కీలక సమయంలో అతనిపై రెండు ర్యాపిడ్‌ గేమ్‌లనూ గెలిచి టైటిల్‌కు మార్గం సుగమం చేసుకున్నా. ఏడాదిగా నా ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ ఆటతీరులో కొన్ని మార్పులు చేసుకొన్నా. ఇప్పుడు ఫలితం రాబట్టా” అని ప్రజ్ఞానంద ఉద్వేగంతో చెప్పారు. 

ఈ ఏడాది మొదట్లో ప్రజ్ఞానందకు కలిసిరాలేదు. భారీ అంచనాలతో క్యాండిడేట్స్‌ టోర్నీ బరిలో నిలిచిన అతడు.. ఆ ఈవెంట్‌లో నిరాశపరిచినా తర్వాత క్రమంగా పుంజుకున్నాడు. నార్వే చెస్‌ టైటిల్‌ను గెలువడం ప్రజ్ఞాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ ఈవెంట్‌లో అతడు దిగ్గజ చెస్‌ ప్లేయర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించడం గమనార్హం. 

అనంతరం సెయింట్‌ లూయిస్‌, సింక్‌ఫీల్డ్‌ కప్‌లనూ గెలుచుకుని జీసీటీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. సెమీస్‌లో విన్సెంట్‌ కీమర్‌ను ఓడించి కరువానాతో అమీతుమీకి సిద్ధమయ్యాడు. సుమారు నెల రోజులుగా సెయింట్‌లూయిస్‌లోనే ఉండటమూ అతడి విజయానికి కలిసొచ్చింది.