రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం జబల్‌పూర్‌లోని వెహికల్ ఫ్యాక్టరీలో టి-సిరీస్ ట్యాంకుల ఓవర్‌హాల్ ప్రాజెక్ట్‌కు భూమి పూజ చేశారు. రూ. 472 కోట్ల ఈ ప్రాజెక్ట్, టి-72, టి-90 ట్యాంకుల ఓవర్‌హాల్ కోసం సౌకర్యాలను కల్పిస్తుంది. తద్వారా భారతదేశం స్వావలంబన దిశగా సాగిస్తున్న ప్రయాణంలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుంది.
ఈ సౌకర్యాల ద్వారా ఏటా 80 ట్యాంకులను ఓవర్‌హాల్ చేసేలా రూపొందించారు. దీనివల్ల భారత సైన్యానికి ఓవర్‌హాల్ చేసిన ట్యాంకులు సకాలంలో అందుబాటులో ఉండటంతో పాటు, దాని కార్యాచరణ సంసిద్ధత మరింత పెరుగుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ప్రకారం, సైన్యానికి ప్రతి సంవత్సరం సుమారు 230 ట్యాంకులను ఓవర్‌హాల్ చేయవలసి ఉండగా, ప్రస్తుతం ఆవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీకి ఏటా 150 ట్యాంకులను ఓవర్‌హాల్ చేసే సామర్థ్యం ఉంది.
భారతదేశపు పెరుగుతున్న సాంకేతిక పరాక్రమానికి, పారిశ్రామిక సామర్థ్యాలకు ఈ ప్రాజెక్ట్ ఒక నిదర్శనమని, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోని అగ్రగామి రక్షణ తయారీ, ఎగుమతి కేంద్రాలలో ఒకటిగా భారతదేశం ఆవిర్భవించాలనే లక్ష్యానికి ఇది దోహదపడుతుందని రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. డ్రోన్‌లు, ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించే ఆయుధాలు, క్షిపణులు, ఉపగ్రహాలు, కృత్రిమ మేధస్సు, సైబర్ యుద్ధం వంటి వాటి రాకతో యుద్ధ స్వరూపం మారుతున్నప్పటికీ, ట్యాంకుల ప్రాముఖ్యత తగ్గకపోగా, మరింత అభివృద్ధి చెందిందని ఆయన నొక్కి చెప్పారు.
ఆధునిక యుద్ధానికి ఒకే వ్యవస్థపై ఆధారపడటం కంటే, సమిష్టి సామర్థ్యాలు అవసరం. ట్యాంకులు, పదాతి దళం, ఫిరంగి దళం, డ్రోన్లు, వాయు శక్తి, నిఘా, కచ్చితమైన ఆయుధాలు కలిసి ఒక సమీకృత పోరాట వ్యవస్థను ఏర్పరుస్తాయని తెలిపారు. “ఈ భావనను భారత సైన్యం తన ‘ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్’ ద్వారా ప్రదర్శించింది. ఆధునిక యుద్ధరంగ అవసరాలకు అనుగుణంగా మన ట్యాంకులకు ఉన్నతమైన సెన్సార్లు, సామర్థ్యాలను సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఈ ఓవర్‌హాల్ సదుపాయం ఈ దార్శనికతను ముందుకు తీసుకువెళ్తుంది,” అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
గత నాలుగు దశాబ్దాలుగా అవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ భారత సైన్యానికి సుమారు 4,400 ట్యాంకులను సరఫరా చేసిందని, ఇది దేశ సాయుధ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో దాని గణనీయమైన కృషిని నొక్కి చెబుతోందని ఆయన తెలిపారు. ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ పై విశ్వాసం వ్యక్తం చేస్తూ, టి-72, టి-90 వేరియంట్ ట్యాంకులను ఓవర్‌హాల్ చేయడంలో ఆ సంస్థకు ఉన్న 25 ఏళ్ల అనుభవం, రాబోయే సంవత్సరాల్లో నాణ్యత, ఉత్పాదకత, ఆవిష్కరణ, ప్రపంచ పోటీతత్వంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

More Stories
“రక్షే, మా చలా, మా చలా”.. రాష్ట్రపతి రక్షాబంధన్ శుభాకాంక్షలు
ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థల ఆచూకీ.. పాక్ స్లీపర్ సెల్స్
29 నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌లలో ప్రధాని మోదీ పర్యటన