భారతదేశం 2047 నాటికి సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే బలమైన అంతర్గత భద్రతే పునాది అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించిన జాతీయ భద్రతా వ్యూహాత్మక సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మన దేశమేమీ ధర్మశాల కాదని చెప్పారు. అక్రమచొరబాటుదార్లను కచ్చితంగా అడ్డుకోవాలని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఉగ్రవాదం, మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని భద్రతా దళాలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా రెండు దశాబ్దాల కాలానికి సంబంధించి దేశ అంతర్గత భద్రతా బ్లూప్రింట్‌ను ఆవిష్కరించారు. “ఈ దేశం ఏమీ ధర్మశాల కాదు. ఇక్కడ నివసించే హక్కు కేవలం ఈ దేశ పౌరులకు మాత్రమే ఉంది” అని ఆయన తేల్చి చెప్పారు.
అక్రమ చొరబాటుదారులు దేశ భద్రతకే కాకుండా ఆర్థిక స్థిరత్వానికి, జనాభా ప్రాతిపదికన ఉండే సామాజిక సమతుల్యతకు తీవ్ర ముప్పుగా పరిణమించారని హెచ్చరించారు. గత ఎనిమిది నెలలుగా సరిహద్దు ఉన్న అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపి నాలుగు అంచెల సరిహద్దు భద్రతా చట్రాన్ని సిద్ధం చేశామని తెలిపారు. అలాగే అతి తక్కువ సమయంలోనే భారతదేశాన్ని అక్రమ చొరబాటురహిత దేశంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని వెల్లడించారు.
గత ప్రభుత్వాలు నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి, నార్కోటిక్స్ వంటి సవాళ్లను ప్రారంభంలోనే అంచనా వేసి అడ్డుకోకపోవడం వల్లే దేశం దశాబ్దాల పాటు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని అమిత్ షా చెప్పారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో ఈ మూడు ప్రధాన అంతర్గత భద్రతా ముప్పులను విజయవంతంగా అధిగమించిందని తెలిపారు.
పీఎఫ్ఐ నిషేధం తర్వాత చేపట్టిన చర్యలు కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సమర్థవంతమైన సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే ఉగ్ర నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ‘ప్రహార్’ వ్యూహాన్ని రోజువారీ భద్రతా చర్యల్లో భాగం చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల నివారణకు సంబంధించి ‘డిటెక్ట్, డిస్రప్ట్ అండ్ డిస్ట్రాయ్’ (గుర్తించడం, అడ్డుకోవడం, ధ్వంసం చేయడం) అనే వ్యూహాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.
నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ 2026-2029ని క్షేత్రస్థాయిలో అమలు చేసి భవిష్యత్తు తరాలను రక్షించాలని సూచించారు. అంతేకాకుండా 2019 నుంచి 2026 మధ్య కాలంలో దాదాపు 274 మంది ఆర్థిక నేరస్థులు, పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్‌కు రప్పించామని తెలిపి, విదేశాల్లో దాక్కున్న నేరస్థులందరినీ చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ముందస్తు వ్యూహాలు, సమగ్ర చర్యల ద్వారా మాత్రమే సురక్షితమైన, చొరబాటురహిత భారత నిర్మాణం సాధ్యమవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.

More Stories
అనుకోకుండా పాక్ అణుస్థావరం కిరణ్ హిల్స్ పై దాడి!
యుపిలో 60 ఏళ్ళు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఢిల్లీలో నిరసనల దృష్ట్యా ఇంటెలిజెన్స్ వ్యవస్థపై పోలీసుల దృష్టి