ఈశాన్య ప్రాంత ధైర్యసాహసాలు, పరివర్తన గాథలకు మరింత గుర్తింపు ఇవ్వాలని అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ పిలుపునిచ్చారు. అభిజిత్ జోగ్ రచించి, సురుచి ప్రకాశన్ ప్రచురించిన ‘గ్రిట్ & గ్లోరీ’ అనే పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యక్తులు తమ స్థైర్యం, సంకల్పం, నిరంతర కృషితో ప్రతికూలతలను ఎలా అధిగమించారో తెలిపే స్ఫూర్తిదాయకమైన కథలను అందిస్తుంది.
వారి ప్రయాణాలు, సాధారణ ప్రజలు ధైర్యం మరియు నిబద్ధతతో ఇతరుల జీవితాలలో ఎలా అర్థవంతమైన మార్పును తీసుకువచ్చారో, తమ సమాజాల అభివృద్ధికి ఎలా దోహదపడ్డారో ప్రతిబింబిస్తాయి. ఈ సందర్భంగా డాక్టర్ హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ “నేడు ఈశాన్య భారతదేశం అంతటా జాతీయవాద నినాదాలు మిన్నంటుతున్నాయి. పరాయీకరణ భావన స్థానంలో, తమవారమనే భావన, ఐక్యత బలపడుతున్నాయి” అని చెప్పారు.
“ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం గర్వంగా రెపరెపలాడుతోంది. ఈ మార్పు వెనుక సంఘ్ కార్యకర్తల త్యాగం, అంకితభావం ఉన్నాయి. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన ఆ మహనీయుల త్యాగాల చరిత్రే ఈ పుస్తకం” అని తెలిపారు. పాంచజన్య సంపాదకులు హితేష్ శంకర్ మాట్లాడుతూ, “ఈశాన్య ప్రాంతంలో వచ్చిన మార్పుకు సంబంధించిన కథనం మాత్రమే కాకుండా, ఇది ఒక చైతన్యానికి సంబంధించిన కథనం కూడా అని చెప్పారు. ఇందులో అనుభవపూర్వక సాక్ష్యాలతో పాటు గణాంకాలు కూడా ఉన్నాయని తెలిపారు.
సామాజిక కార్యకర్త హరి మారుతి మిరాస్దార్ మాట్లాడుతూ, “ఈ పుస్తక రచనలో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 175 మంది కార్యకర్తలతో ఇంటర్వ్యూలు నిర్వహించాము. ఇంకా చాలా మంది కార్యకర్తల వివరాలను నమోదు చేయాల్సి ఉంది” అని తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వాతావరణాన్ని సృష్టించడానికి సర్వస్వం త్యాగం చేసిన వారి చరిత్రను భద్రపరిచే దిశగా ఇది ఒక మంచి ప్రయత్నం అని పేర్కొన్నారు. రచయిత అభిజిత్ జోగ్ పుస్తక నేపథ్యాన్ని వివరిస్తూ, ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి ప్రేరణనిచ్చిన అనుభవాలు, కథనాలను క్లుప్తంగా పంచుకున్నారు.
‘సురుచి ప్రకాశన్’ చైర్మన్ రాజీవ్ తులి మాట్లాడుతూ ప్రచురణ కార్యక్రమాల ద్వారా, భారతదేశ చరిత్ర, సంస్కృతి, సమాజం, యు జాతీయ జీవనానికి సంబంధించిన అర్థవంతమైన రచనలను విస్తృత పాఠకవర్గానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి చెందిన ధైర్యం, పట్టుదల,పరివర్తనకు సంబంధించిన కథనాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా ‘గ్రిట్ & గ్లోరీ’ ఈ ప్రయత్నానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది చెప్పారు.

More Stories
`వికసిత్ భారత్’ బలమైన అంతర్గత భద్రతే పునాది
అనుకోకుండా పాక్ అణుస్థావరం కిరణ్ హిల్స్ పై దాడి!
యుపిలో 60 ఏళ్ళు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం