* న్యూయార్క్‌లో మరో భారతీయుడి కాల్చివేత
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం, జాక్సన్ నగరంలో ఉన్న తన దుకాణంలో గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఆఖజ్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల వ్యాపారవేత్త కాల్చి చంపారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆయన 19 ఏళ్ల కుమార్తె కూడా అక్కడే ఉన్నారు అని గ్రామస్తులు తెలిపారు. మరణించిన వ్యక్తిని సురేష్ పర్సోత్తమ్‌దాస్ పటేల్‌గా గుర్తించారు. ఆయన దాదాపు 30 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు.
ఈ ఘటనకు కేవలం వారం రోజుల ముందే జాక్సన్ నగరంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సురేష్ పటేల్‌కు చెందిన
రిడ్జ్ క్రెస్ట్ సెల్లర్స్అనే లిక్కర్ షాప్‌లోకి మాస్క్ ధరించిన దుండగుడు ప్రవేశించి తుపాకీతో బెదిరించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేయగా, షాపులో ఉన్న పటేల్ దొంగకు డబ్బులు అందించారు. అయినా విచక్షణారహితంగా కాల్పులు జరిపిన నిందితుడు పటేల్‌ను అక్కడికక్కడే బలితీసుకున్నాడు.
నిందితుడు గ్రే కలర్ హూడీ, జీన్స్ ధరించి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. దోపిడీ అనంతరం తెల్లటి కారులో పరారైనట్లు జాక్సన్ పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఆఖజ్ గ్రామ నివాసి దినేష్ సుతార్ మాట్లాడుతూ, “సురేష్ పటేల్ చాలా కాలం పాటు చికాగోలో నివసించారు. ఈ ఘటనకు వారం రోజుల ముందే జాక్సన్ నగరంలో తన కొత్త దుకాణాన్ని ప్రారంభించారు” అని చెప్పారు.
మరోవంక, న్యూయార్క్ నగరంలో శుక్రవారం గుర్దీప్ సింగ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్, కపుర్తాలా జిల్లాలోని జబోవాల్ గ్రామానికి చెందిన గుర్దీప్ సింగ్ 2017లో అక్రమ మార్గంలో అమెరికా వెళ్లాడు. ఇందుకోసం భారీగా అప్పు చేశాడు. జీవితం కోసం వెళ్లిన అతడు చివరకు అక్కడ పిజ్జా డెలివరీ పార్ట్‌నర్‌గా పని చేస్తున్నాడు.
శుక్రవారం న్యూయార్క్ నగరంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్తుండగా, బ్రూక్లిన్ వద్ద అతడిని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. స్తానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పులపై పోలీసులకు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు స్థానికులు సమాచారం అందించారు. వారు వచ్చి, గాయాలతో పడి ఉన్న గుర్దీప్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

More Stories
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై 21 మంది మాజీ కెప్టెన్ల ఆందోళన!
సరిహద్దు సమస్యపై చర్చలకు నేడే చైనాకు అజిత్ దోవల్
డ్రగ్స్ తీసుకోవడం చూసినందుకు బంగ్లాలో హిందూ కుటుంబం హత్య