పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న పంజాబ్ ప్రావిన్సుల నగరం రావల్పిండిలో భద్రత విధుల కోసం సైన్యాన్ని మోహరించింది. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. రావల్పిండిలో సమస్యాత్మక భద్రత విధుల కోసం ఆరు నెలల పాటు పాకిస్థాన్ ఆర్మీకి చెందిన మూడు కంపెనీలను మోహరించేందుకు ఫెడరల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అయితే, ఈ మోహరింపునకు దారితీసిన అసలైన భద్రతా కారణాల స్వభావాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం పౌర పరిపాలన యంత్రాంగానికి భద్రతా సహయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ప్రభుత్వ హోం శాఖ అభ్యర్థన మేరకు ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయని, ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటాయని అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది.
రావల్పిండి జిల్లా యంత్రాంగానికి సహాయపడటం, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు లేదా అనుకోని పరిణామాలైనా ఎదురైతే సమర్థవంతంగా స్పందించడం కోసం ఈ మోహరింపును ఆమోదించారు. పంజాబ్ ఉన్నతాధికారులు మిలిటరీ వర్గాలకు పంపిన ఈ ఉత్తర్వుల్లో సైన్యానికి అప్పగించే నిర్దిష్ట విధులు, బెదిరింపుల వివరాలను వెల్లడించలేదని పాకిస్థాన్ పత్రికలు వెల్లడించాయి.
ఆర్మీ ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలో ఈ మోహరింపు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రతా యంత్రాంగం, జిల్లా అధికారుల నుంచి వివరణ వచ్చిన తర్వాత మాత్రమే అసలు కారణాలపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే, ఇటీవల రావల్పిండిలో భద్రతా దళాలపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీకి చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఒకరు కాల్పులు జరిపిన ఘటన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
ఎదురుకాల్పుల్లో అతడు మరణించగా ఆయుధాలు, పీటీఐ జెండాను స్వాధీనం చేసుకున్నట్లు మీడియా నివేదించింది. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేసిన పిటిఐ, తాము ఏ రకమైన హింసనైనా ఎప్పుడూ సమర్థించలేదని మరోసారి స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ వైపు సెప్టెంబర్ 27న చేపట్టనున్న ‘లాంగ్ మార్చ్’ కోసం ఖాన్ పార్టీ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఆ పార్టీ, ఈ చర్య రాజధానిలో భారీ జన సమీకరణకు దారితీస్తుందని పేర్కొంది. ఖాన్ విడుదలను కోరుతూ 2023 మే మరియు 2024 నవంబర్‌లో పిటిఐ చేపట్టిన గత నిరసనలు భద్రతా బలగాలతో ఘర్షణలకు దారితీశాయి. రావల్పిండి నగరం పాకిస్థాన్ సైనిక దళాల ప్రధాన కార్యాలయానికి నిలయంగా ఉండటం వల్ల వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. అక్కడ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.

More Stories
హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటించిన ట్రంప్
మయన్మార్‌లోని బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి.. 14 మంది మృతి
గంటల్లో ఇమ్రాన్ ఖాన్ హాస్పిటల్ నుండి జైలుకు తరలింపు