పార్టీ బలోపేతంకై కొత్త ఆలోచనలు, దృక్పధాలు.. మోదీ 

పార్టీ బలోపేతంకై కొత్త ఆలోచనలు, దృక్పధాలు.. మోదీ 

* అధికారంలో మోదీ 25 ఏళ్ళు.. బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నూతన కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను పంచుకుంటూ, పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో “కొత్త ఆలోచనలు, దృక్పథాలను” పంచుకోవడానికి ఈ సంస్థాగత సమావేశం ఒక అవకాశమని మోదీ పేర్కొన్నారు. 
 
“సంస్థాగత సమావేశాలు అంటేనే పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో సంబంధాలను మరింత దృఢతరం చేయడం కోసం కొత్త ఆలోచనలు, దృక్పథాలను చర్చించడం. పార్టీ సహచరులు, కొత్త సంస్థాగత బృందంతో అద్భుతమైన సంభాషణ జరిగింది!” పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాన మంత్రికి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ సాదర స్వాగతం పలికారు. 
 
సమావేశం అనంతరం, బీజేపీ నూతన కార్యవర్గ సభ్యులు ప్రధాని మోదీతో కలిసి సామూహిక ఛాయాచిత్రం (గ్రూప్ ఫోటో) కోసం నిలబడ్డారు. పార్టీ నూతన జాతీయ బృందంతో మోదీ జరిపిన మొదటి సమావేశం ఇది. 65 మంది సభ్యులున్న ఈ బృందంలో 51 మంది కొత్తవారు ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులకు కీలకమైన సంస్థాగత బాధ్యతలు అప్పగించారు. 
 
యువతతో మమేకం కావడంపై ప్రత్యేక దృష్టి సారించడంతో సహా, వరుస సంస్థాగత, ప్రజా సంబంధిత కార్యక్రమాలకు బీజేపీ సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. అంతకుముందు, నబిన్ నూతన కార్యవర్గ సభ్యులతో సమావేశమై “యువ సంవాద్” (యువతతో నిరంతర సంభాషణ) ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.  14 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని పార్టీ ప్రజా సంబంధిత కార్యక్రమాలను రూపొందిస్తోంది.
వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తోంది. ఈ బృందాల ఏర్పాటులో సహాయపడటం, వారి కార్యకలాపాలను సమన్వయం చేసే బాధ్యతను భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం)కు అప్పగించారు. ఈ ప్రచారంలో మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులకు కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సంస్థాగత సన్నాహాలపై కూడా చర్చ జరిగింద.
ఇందులో పార్టీ క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, సంస్థాగత సన్నద్ధతను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించారు.  ‘వందేమాతరం’ చారిత్రక వారసత్వాన్ని గౌరవిస్తూ బీజేపీ తీర్మానం చేసిన తర్వాత, జాతీయ గీతం చరిత్ర, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రకటించిన కొద్ది సేపటికే ఈ సమావేశం జరిగింది.
 
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టి 
 
అనేక రాష్ట్రాల్లో ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తరుణంలో బీజేపీ తన సంస్థాగత కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. ఆదివారం ఉదయం  గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయ విస్తరణ భవనంలో నబిన్ మరో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లు హాజరుకానున్నారు. 
 
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లతో సహా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఇందులో సమీక్ష జరగనుంది. పార్టీ కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమీకరణ, సంస్థాగత అంశాలు,  ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేసే పద్ధతులపై కూడా చర్చలు జరగనున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ ప్రధాన కార్యాలయం, విస్తరణ కార్యాలయంలో పలు సమావేశాలు షెడ్యూల్ చేశారు.  వీటిలో రాష్ట్ర అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపే సమావేశాలు కూడా ఉన్నాయి.  
 
మోదీ 25 ఏళ్ల అధికారానికి గుర్తుగా ప్రచార కార్యక్రమం
 
ప్రధాని మోదీ ప్రభుత్వాధినేతగా అధికారం చేపట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ పేరుతో మోదీ జన్మదినమైన సెప్టెంబరు17వ తేదీ నుంచి అక్టోబరు 17వ తేదీ వరకు నెలరోజులపాటు భిన్న ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ జాతీయ కార్యదర్శి వినోద్‌ తావ్డే వెల్లడించారు. 
 
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జాతీయ వర్క్‌షా్‌పను నిర్వహించారు. “వచ్చే అక్టోబరు7వ తేదీతో ప్రభుత్వాధినేతగా అధికారం చేపట్టి మోదీ 25 ఏళ్లు పూర్తిచేసుకుంటున్నారు. 2001, అక్టోబరు 7న ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నెలపాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం” అని తెలిపారు. 
 
“దేశ సేవలో మోదీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ నెలపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. అంగన్వాడీ సమ్మాన్‌, మాతృ సమ్మాన్‌ పేరుతో పార్టీ కార్యకర్తలు దేశంలోని 14 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలను కలిసి, వారి సేవలను ప్రశంసిస్తారు. యువతకు దగ్గరయ్యేలా సేవా మే యోగ్‌దాన్‌, రాష్ట్రీయ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తాం. సామాజిక సేవ ప్రాధాన్యాన్ని తెలిపేలా సేవా సేతు అభియాన్‌ పేరుతో సోషల్‌ మీడియాలో రీల్స్‌ ద్వారా ప్రచారం నిర్వహిస్తాం. ప్రజలు రీల్స్‌ను పోస్ట్‌ చేసేందుకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేస్తాం’’ అని వివరించారు.