ఢిల్లీలో విద్యార్థులపై దాడి విచారణకు సుప్రీంకోర్టు కమిటీ

ఢిల్లీలో విద్యార్థులపై దాడి విచారణకు సుప్రీంకోర్టు కమిటీ
నీట్‌ పేపర్​ లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా గత నెల 20న చలో పార్లమెంట్‌ చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు బలప్రయోగం చేశారనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్‌ జాయమాల్య బాగ్చి, జస్టిస్​ వి.మోహనతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయించింది. 
 
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాశ్ రెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. ఆయనతో పాటు పంజాబ్- హరియాణా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌కే ఝా, దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ శలిందర్‌ కౌర్‌, సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆర్‌కే శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్‌ఆర్‌ బిష్ణోయ్‌ కమిటీ సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ మొదటగా పోలీసుల చర్యలపై వచ్చిన ఆరోపణలు, నిరసనకారులపై పెల్లెట్ గన్స్, ఎలక్ట్రిక్ లాఠీలు, టియర్ గ్యాస్‌ ప్రయోగం, లాఠీఛార్జి వంటి తీవ్రమైన చర్యలపై విచారణ జరపనుంది. మహిళా నిరసనకారులపై హింస, పోలీసుల నిఘా వ్యవహారాలు, అల్లర్లను నియంత్రించే క్రమంలో అవసరానికి మించి భద్రతా బలగాలు వ్యవహరించాయా అన్న కోణంలో విచారణ చేయనుంది. 
 
మరోవైపు ఆందోళనకారుల వల్ల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలు, నిరసనల పేరుతో జరిగిన ప్రభుత్వ, ప్రజా ఆస్తుల ధ్వంసంపైనా ఉన్నతస్థాయి కమిటీ విచారణ జరపనుంది. ఈ విచారణ కోసం అవసరమైన సీసీటీవీ కెమెరా వీడియోల్ని కమిటీకి అందించాలని సుప్రీంకోర్టు అధికారుల్ని ఆదేశించింది. బాధితుల నుంచి ఫిర్యాదుల్ని కూడా కమిటీ స్వీకరిస్తుంది. ఈ అంశాలపై నిరంతర, క్రమబద్ధమైన సమీక్షను చేపట్టాలని, అలాగే తమకు మధ్యంతర నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలని కమిటీని ఆదేశించింది.