బాణసంచాపై పూర్తి నిషేధంకు సుప్రీంకోర్టు తిరస్కారం

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా వినియోగంపై సుప్రీంకోర్టు బాణసంచాపై పూర్తి నిషేధం విధించడం, ఎలాంటి నియంత్రణ లేకుండా వినియోగానికి అనుమతించడం.. ఈ రెండు విధానాలను తిరస్కరించింది. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని మధ్యేమార్గాన్ని అనుసరించాలని సూచించింది. జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ పీబీ వరలే నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. 
 
దీపావళి వేడుకలతో ప్రజలకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని బాణసంచాపై పూర్తి నిషేధాన్ని సమర్థించబోమని స్పష్టం చేసింది. అలాగే రోజంతా బాణసంచా కాల్చేందుకు అనుమతించబోమని ధర్మాసనం పేర్కొంది. వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడింది.  బాణసంచా వినియోగానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించే విధంగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. “పూర్తి నిషేధాన్ని అంగీకరించలేం.. అదే సమయంలో 24 గంటల పాటు బాణసంచా కాల్చేందుకు కూడా అనుమతించలేం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బేరియం ఆధారిత బాణసంచా వినియోగంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నుంచి నివేదిక సమర్పించాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి కోరారు. బేరియం ఆధారిత బాణసంచాపై బహిరంగ పరీక్షలు ఇంకా నిర్వహించలేదని ఆమె కోర్టుకు తెలిపారు. దీనిపై సీపీసీబీ తన నివేదికను సమర్పించేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది.

ఒకే ఫ్యూజ్‌తో వరుసగా పేలే జాయింట్‌ బాణసంచా వినియోగాన్ని కొన్ని నిబంధనలకు లోబడి అనుమతించే అంశాన్ని కూడా కోర్టు పరిశీలిస్తోంది. విచారణ సందర్భంగా సమర్పించిన సూచనలను పరిగణనలోకి తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ధర్మాసనం పేర్కొంది.

దీపావళి సమయంలో వాయు కాలుష్యంపై దృష్టి పెట్టిన సుప్రీంకోర్టు పంటల దహనం వంటి ఇతర కారణాలు కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయని ప్రస్తావించింది. అయితే బాణసంచా అనియంత్రిత వినియోగాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. పండుగ సమయంలో నిర్దిష్ట సమయాల్లో మాత్రమే వినియోగించే విధానంపై పరిశీలన కొనసాగుతుందని తెలిపింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ సహా వాయు కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో అక్టోబర్‌ నుంచి జనవరి మధ్య బాణసంచాపై ఆంక్షలకు సంబంధించిన 2015 నాటి కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. గతంలో కూడా పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాణసంచా వినియోగంపై పలు ఆదేశాలు జారీ చేసింది.

About The Author