* పరిస్థితి ఉద్రిక్తంగా మారినందుకే లాఠీఛార్జ్.. ఢిల్లీ పోలీసులు స్పష్టం
జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ చట్టవ్యతిరేకం అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మార్చ్‌కు అనుమతి లేదని, అలాగే, అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినందువల్లే బలప్రయోగం చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు పోలీసులు తమ వాదన వినిపించారు. సీజేపీ ఆందోళన సందర్భంగా అక్కడి విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు, కేంద్ర బలగాలు లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టియర్ గ్యాస్, పెల్లెట్స్ ప్రయోగం కూడా జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
దీంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి ఢిల్లీ పోలీసులు బదులిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. సీజేపీ ఆందోళనకు అనుమతి లేదని, అది చట్టవ్యతిరేకం అని ఈ అఫిడవిట్‌లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం సీజేపీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌కు జంతర్ మంతర్ వద్దకు 30,000 మంది వరకు వచ్చారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వారంతా నిలిచి ఉన్నారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు 5,000 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. మొదట ఈ ర్యాలీ శాంతియుతంగా జరిగింది. ఆ తర్వాత కొందరు ఆందోళనకారులు బారికేడ్లు దాటుకుంటూ పార్లమెంట్ వైపు దూసుకొచ్చారు. దీంతో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో వారిని అదుపు చేసేందుకే బలప్రయోగం చేయాల్సి వచ్చింది.
ఈ ఘర్షణల్లో 240 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 200 మంది ఆందోళనకారులకు కూడా గాయాలయ్యాయి. ఆందోళనకారులు మరింత ముందుకు రాకుండా ఉండేందుకు, శాంతి భద్రతల్ని కాపాడేందుకే లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఆందోళనలో పాల్గొన్నవారిలో కొందరిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. 2,873 మందిపై హత్యాయత్నం, దోపిడీ, పోక్సో సహా పలు క్రిమినల్ కేసులున్నాయి. వీటిని సిట్ విచారిస్తోందని వివరించారు.
“ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు మేకులు కలిగిన లాఠీల్ని వాడలేదు. దీనికి సంబంధించి వైరల్ అయిన ఫొటోల్లో ఉన్నది పోలీసు కాదు.. ఆందోళనకారుడు. ఈ నిరసన సందర్భంగా కొందరు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. వారిపై దాడి జరిగింది అంటూ వైరల్ అయిన కంటెంట్‌లో పూర్తి వివరాలు లేవని, వాటిలో స్పష్టత లేదు” అని పోలీసులు తెలిపారు. ఆందోళనలో పాల్గొన్న నిందితుల్ని గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వాడినట్లు పోలీసులు తెలిపారు.

More Stories
ఎన్ ఆర్ సి అమలుకోసం మణిపూర్ లో 48 గంటల సమ్మె
మహారాష్ట్రలో మత స్వాతంత్రం చట్టం 28 నుండి అమలు
దాదాపు సగం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు