దాదాపు సగం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు 

దాదాపు సగం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు 
రాజకీయాల్లో నేరీకరణపై సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ‘అమికస్ క్యూరీ’ (న్యాయస్థానానికి సహాయపడే న్యాయవాది) అందించిన వివరాల ప్రకారం, 543 మంది లోక్‌సభ ఎంపీలలో 251 మంది, 233 మంది రాజ్యసభ సభ్యులలో 75 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, పార్లమెంటు సభ్యులు (ఎంపీలు), శాసనసభ సభ్యుల (ఎమ్మెల్యేలు)పై 4,000కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 
 
ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ న్యాయవాది, బిజెపి నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిఐఏ లో హన్సారియా ‘అమికస్ క్యూరీ’గా నియమితులయ్యారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, 28 రాష్ట్రాలకు గాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు (తీవ్రమైన నేరాలతో సహా) ఉన్నట్లు ప్రకటించారు. 
 
సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాల ప్రకారం, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి (29 కేసులు), కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (19 కేసులు) ఉన్నారు. అమికస్ క్యూరీగా కోర్టుకు సహాయపడుతున్న సీనియర్ న్యాయవాది హన్సారియా, ప్రస్తుత, మాజీ ఎంపీలు/ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనానికి తెలిపారు. 
 
కేవలం 2025లోనే 1,243 కేసుల పరిష్కారం జరగగా, 1,050 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎడిఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) గణాంకాలను ఉటంకిస్తూ, 543 మంది లోక్‌సభ ఎంపీలలో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 170 తీవ్రమైనవని అఫిడవిట్ పేర్కొంది. రాజ్యసభలో 233 మంది సభ్యులలో 75 మందిపై కేసులు ఉండగా, వాటిలో 40 తీవ్రమైన నేరాలకు సంబంధించినవి. 
 
రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళ ఎంపీలలో 95% మందిపై కేసులు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణలో 82%, ఒడిశాలో 76% మందిపై కేసులు ఉన్నాయి. హర్యానా, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో ఎంపీపై మాత్రమే కేసులు ఉన్నాయి. ఎంపీలు/ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణను ప్రత్యేక కోర్టులు మాత్రమే చేపట్టాలని, అలాగే అభియోగాలు నమోదైన ఏడాదిలోగా కేసుల పరిష్కారం జరిగేలా హైకోర్టులు నెలవారీగా పురోగతిని పర్యవేక్షించాలని హన్సారియా ఆదేశాలు కోరారు.