చెస్ క్రీడాకారులు విధిత్ గుజరాతీ, దివ్య దేశ్‌ముఖ్‌లకు అర్జున అవార్డు

చెస్ క్రీడాకారులు విధిత్ గుజరాతీ, దివ్య దేశ్‌ముఖ్‌లకు అర్జున అవార్డు
 కేంద్ర క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ 2025 జాతీయ క్రీడా పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. 17 మంది క్రీడాకారుల‌ను అర్జున అవార్డు వ‌రించింది. ఈ పురస్కారానికి నామినేట్​ అయినవారి విషయానికొస్తే, చెస్ విభాగంలో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోశ్ గుజరాతీని అవార్డు వరించింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత్‌కు అద్భుత విజయాలను అందించడంలో విదిత్ సంతోశ్​కీలక పాత్ర పోషించారు. 
అలాగే, మహిళల విభాగంలో ఫిడే ప్రపంచ కప్‌లో అదరగొట్టిన దివ్య జితేంద్ర దేశ్‌ముఖ్ సైతం అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. భారత్‌లో చెస్ క్రీడకు లభిస్తున్న ఆదరణకు ఈ అవార్డులే నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక, మహిళల డబుల్స్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో అంచలంచెలుగా ఎదుగుతున్న పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడికి సంయుక్తంగా ఈ గౌరవం దక్కింది.
మరోవైపు, డెకాథ్లాన్, హైజంప్ విభాగంలో దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిన తేజస్విన్ శంకర్‌కు ఈ అవార్డు లభించింది. అలాగే రేస్ వాకింగ్‌లో దేశ కీర్తిని పెంచిన ప్రియాంక గోస్వామి, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో దూసుకుపోతున్న మహమ్మద్ అజ్మల్ కూడా ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో అవకాశం లభించింది.  వీరితో పాటు నరేందర్ (బాక్సింగ్), లాల్‌రెమ్సియామి (హాకీ), ​​రాజ్‌కుమార్ పాల్ (హాకీ), ​​సుర్జీత్ (కబడ్డీ), పూజ (కబడ్డీ), రుద్రాంశ్ ఖండేల్‌వాల్ (పారా-షూటింగ్), ఏక్తా భయన్ (పారా-షూటింగ్), అరవింద్ సింగ్ (రోయింగ్), అఖిల్ షెరాన్ (షూటింగ్) అవార్డులను అందుకోనున్నారు.  

సెల‌క్ష‌న్ క‌మిటీ మొత్తం 24 మంది పేర్ల‌ను అర్జున అవార్డుకు రిక‌మండ్ చేసింది. కానీ 17 మంది పేర్ల‌ను మాత్ర‌మే ఆమోదించారు. అర్హులైన క్రీడాకారుల‌కు మాత్ర‌మే అవార్డులు ఇవ్వాల‌న్న ఉద్దేశంతో ఆట‌గాళ్ల జాబితాను చాలా క‌ట్టుదిట్టంగా స్క్రీనింగ్ చేశారు. దీంతో అవార్డుల ప్ర‌క‌ట‌న సుమారు ఆర్నెళ్లు ఆల‌స్య‌మైంది.  అర్జున అవార్డుకు ఎంపికైన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం పురస్కార ప్రదానోత్సవంలో భాగంగా విజేతలకు రూ.15 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.

గత నాలుగేళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారుల పేర్లను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, తుది జాబితాను ప్రకటించింది. 1962 ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఐ. అరుమాయినాయగానికి జీవిత సాఫల్య అవార్డు దక్కింది. క్రీడా రంగంలో దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ అవార్డును ఈసారి ఎవరికీ ప్రకటించకపోవడం గమనార్హం.