యూపీకి వినోద్‌ తావ్డే, పంజాబ్‌ కు సతీశ్‌ పూనియా, గుజరాత్‌ కు తరుణ్‌ చుగ్‌

యూపీకి వినోద్‌ తావ్డే, పంజాబ్‌ కు సతీశ్‌ పూనియా, గుజరాత్‌ కు తరుణ్‌ చుగ్‌
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా  ఉత్తర​ప్రదేశ్, పంజాబ్, గుజరాత్​ రాష్ట్రాలపై బిజెపి ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ మంగళవారం ఆయా రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ వెల్లడించింది.  ఉత్తర్‌ప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డేను నియమించారు. కో-ఇన్‌ఛార్జ్‌గా జాతీయ కార్యదర్శి జగదీశ్‌ ఈశ్వర్‌భాయ్‌ పటేల్‌కు బాధ్యతలు అప్పగించారు.
దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రంగా ఉన్న యూపీలో 2027 అసెంబ్లీ ఎన్నికల నేథ్యంలో సంస్థాగత వ్యవహారాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, ఎన్నికల వ్యూహంపై తావ్డే బృందం దృష్టి పెట్టనుంది.  ఇక పంజాబ్‌ రాష్ట్ర బిజెపి ఇన్‌చార్జ్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ సతీశ్‌ పూనియాను నియమించారు. అలాగే గుజరాత్‌ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌కు అప్పగించారు.

అత్యంత కీలకమైన నియామకం పంజాబ్‌కు సంబంధించినది. జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా విమానం (ఫ్లైట్ 171) ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించిన తర్వాత, అక్కడ పార్టీకి ఎవరూ ఇన్‌ఛార్జ్‌గా లేరు.  మూడు నెలల క్రితం పంజాబ్ బీజేపీ సంస్థను బలోపేతం చేసే బాధ్యతను పూనియాకు అప్పగించారు. ఆయన హర్యానాకు బీజేపీ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ రాష్ట్రంలో పార్టీ హ్యాట్రిక్ సాధించినప్పుడు కూడా ఆయనే సారథ్యం వహించారు. 

రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడైన పూనియా, పంజాబ్‌లో హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీతో కలిసి పనిచేయనున్నారు. ఓబీసీ వర్గాలను చేరుకునే బాధ్యతను సైనీకి అప్పగించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న జాట్ సిక్కులను మరింతగా చేరుకోవడం, ఓబీసీ, దళితుల మద్దతును పెంచడం ద్వారా హర్యానాలో విజయం సాధించిన నమూనాను పంజాబ్‌లో కూడా బీజేపీ పునరావృతం చేస్తుందని భావిస్తున్నారు. 

పూనియా ఇటీవల రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన స్వయంగా జాట్ వర్గానికి చెందినవారు. ఇతర రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌ల నియామకాలను త్వరలో చేపడతామని బీజేపీ తెలిపింది. అప్పటివరకు ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభారీ వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.