కాంగ్రెస్ ‘మావోయిస్టు పార్టీ’గా మారుతుంది

కాంగ్రెస్ ‘మావోయిస్టు పార్టీ’గా మారుతుంది
కాంగ్రెస్ ‘మావోయిస్టు పార్టీ’గా మారుతోందని ఓ ప్రముఖ వార్త సంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో  కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ దిమాగీ నక్సల్స్‌ అనే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేస్తూ అయితే కాంగ్రెస్ నాయకులు అది తమను ఉద్దేశించినదని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 
అయినప్పటికీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి అటువంటి భావజాలాలు కలిగిన వ్యక్తుల ఆధిపత్యంలో ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ ‘మావోయిస్టు పార్టీగా మారుతున్నట్లు కనిపిస్తోందని’ ఆయన ఆరోపించారు. “ఒక రకంగా చెప్పాలంటే, కాంగ్రెస్ ఇప్పుడు మావోయిస్ట్, నక్సలైట్ సంస్థగా మారిపోయింది. గతంలో సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలిలో అటువంటి భావజాలం కలిగిన వ్యక్తుల ఆధిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీయే మావోయిస్ట్ పార్టీగా మారుతున్నట్లు కనిపిస్తోంది” అంటూ ధ్వజమెత్తారు. 

“ఇప్పటికే ముస్లిం లీగ్‌ను పోలినట్లుగా మారిన వారు, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీగా మారే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. దేశ అంతర్గత భద్రతకు మావోయిజం, నక్సలిజం అతిపెద్ద ముప్పు అని, వాటిని నిర్మూలించాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారు” అని ఆయన గుర్తు చేశారు.

పరీక్షలలో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై విద్యార్థులు జరిపిన ఆందోళనల సందర్భంగా పోలీసులు తమ పరిధిని అతిక్రమించారన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం గానీ, తీవ్రమైన గాయాలు గానీ జరగకుండా భారీ ప్రదర్శనలను అదుపులోకి తెచ్చామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ, బీహార్‌లలో అధికారుల స్పందనను రిజిజు సమర్థించారు.

నిరసనలలో వేలాది మంది పాల్గొన్నప్పటికీ పోలీసులు సంయమనం పాటించారని పేర్కొంటూ అయితే రాజకీయ కార్యకర్తలు ప్రదర్శనలలోకి ప్రవేశించి హింసను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపించారు. “ఒక్క వ్యక్తికి కూడా హాని జరగలేదు. ఒక్కరికి కూడా ఎముక విరగలేదు. ఒక్క నిరసనకారుడు కూడా తీవ్రమైన గాయంతో ఆసుపత్రిలో లేడు. ఈ ఉద్యమ స్థాయిని పరిగణించండి: వేలాది మంది వచ్చారు, విద్యార్థుల ముసుగులో ఎంతో మంది నేరగాళ్లు చొరబడ్డారు,” అని రిజిజు వివరించారు.

రాజకీయ ఆందోళనకారులు ప్రదర్శనలలో చేరారని ఆరోపిస్తూ, మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ, భీమ్ ఆర్మీ, సమాజ్‌వాదీ పార్టీల పేర్లను ప్రస్తావించారు. నిరసనకారులు బారికేడ్లను ఛేదించుకుని పార్లమెంటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన తర్వాతే బలప్రయోగం జరిగిందని ఆయన చెప్పారు. “అంతేకాకుండా, ఆమ్ ఆద్మీ పార్టీ, డఫ్లీ వాయించే ఆందోళనకారులు, భీమ్ ఆర్మీ, లేదా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వారైనా సరే, సగానికి పైగా ప్రజలు వచ్చి ఇతరులను హింసకు ప్రేరేపించారు; అయినా కూడా, ఒక్క ప్రాణనష్టం కూడా జరగలేదు,” అని ఆయన వివరించారు. 

వేలాది మంది పాల్గొన్న నిరసన ప్రదర్శనలో ప్రాణనష్టం జరగకుండా నివారించినందుకు పోలీసులను అభినందించాలని రిజిజు వాదించారు. “నిరసనల సమయంలో ఢిల్లీ యంత్రాంగం ఒక్క లాఠీ కూడా ఉపయోగించలేదు. వారు బలవంతంగా పార్లమెంటు వైపు కవాతు చేసినప్పుడు మాత్రమే వారిని ఆపారు. ఎటువంటి మరణాలు సంభవించలేదు. పోలీసులను ప్రశంసించాలి,” అని ఆయన చెప్పారు. 

ఆ తర్వాత రిజిజు, యంత్రాంగాన్ని సమర్థించడాన్ని కాంగ్రెస్‌పై దాడిగా మార్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిరసనలను ఎదుర్కొన్న తీరుతో పోలుస్తూ, ఇటీవలి స్పందనను ఆయన ఉదహరించారు. “కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఉద్యమాలు జరిగి ఉంటే, (అవి చాలా జరిగాయి, వేలాది మంది మరణించారు), ఒక్క తీవ్రమైన గాయం కూడా జరగకుండా ఇంతటి భారీ నిరసనను అదుపు చేసినందుకు ఢిల్లీ పోలీసులను, యంత్రాంగాన్ని ప్రశంసించాలి. కాంగ్రెస్ హయాంలో తుపాకీ కాల్పుల వల్ల వేలాది మంది వాస్తవంగా మరణించారు,” అని ఆయన పేర్కొన్నారు. 

ప్రజా ఆందోళనల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాణాంతకమైన బలప్రయోగానికి పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ, ఆయన ఎమర్జెన్సీని, తెలంగాణ ఏర్పాటు ఉద్యమాన్ని ప్రస్తావించారు. “నిరసనలకు ప్రతిస్పందనగా అత్యవసర పరిస్థితిని విధించేది కాంగ్రెస్ పార్టీయే. దేశంలో జరిగిన వివిధ ఉద్యమాల సమయంలో కాల్పులకు ఎంతమంది బలయ్యారో మీకు గుర్తుండే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు… కానీ ఈ ఉద్యమంలో మాత్రం ఒక్క కాల్పు కూడా జరగలేదు,” అని రిజిజు స్పష్టం చేశారు.