నాలుగేళ్లుగా నివాసం లేని చోట ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు!

నాలుగేళ్లుగా నివాసం లేని చోట ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై విమర్శలు గుప్పించిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కు ఎన్నికల కమిషన్ ధీటుగా జవాబు ఇచ్చింది. ఆయన ఓటును తాము ఏకపక్షంగా తొలగించలేదని, అసలు నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకున్నామని స్పష్టంచేసింది.  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సర్వేలో భాగంగా అధికారులు పరిశీలనకు వెళ్లినప్పుడు, ప్రకాశ్ రాజ్ నాలుగేళ్ల క్రితమే తన నమోదిత చిరునామా నుంచి వేరే ప్రాంతానికి మారినట్లు వెల్లడైందని ఈసీ తెలిపింది.

తాను వేరే చోట నివసిస్తున్న విషయాన్ని ప్రకాశ్ రాజ్ స్వయంగా అంగీకరించారని పేర్కొంటూ కొత్త చిరునామా ఆధారంగా ఓటును పునరుద్ధరించుకోవడానికి ఫారమ్ 6 దాఖలు చేసుకోవచ్చని స్పష్టతనిచ్చింది.  కాగా బెంగళూరులోని తన సొంత నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి పేరు మాయమవ్వడంపై ప్రకాశ్ రాజ్ అంతకుముందు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.  

తాను పుట్టి పెరిగిన ఊర్లోనే తన ఓటును తొలగించడం శోచనీయమని, ఇది ఒక పెద్ద జోక్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  తన ఒక్కడిదే కాకుండా ఏకంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి గాల్లోకి లేపేశారని ఆరోపిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఏది ఏమైనా న్యాయపోరాటం చేసి లేదా దరఖాస్తు చేసుకుని తన ఓటును మళ్లీ సాధించుకుంటానని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఈసీ ఈ అంశానికి సంబంధించి వివరణ ఇచ్చింది. 
 
కాగా, ఒక వ్యక్తికి ఒకే ఓటర్ ఐడి కార్డు ఉండాలన్న ఎన్నికల కమిషన్ నిబంధనను ఉల్లంఘిస్తూ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు ఓటర్ ఐడి కార్డులను కలిగి ఉన్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో, బెంగళూరులోని ఒక నగర న్యాయస్థానం ప్రకాష్ రాజ్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత, గత నెలలో ఆయన షరతులతో కూడిన బెయిల్ పొందారు.