బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ రాజీనామా

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ రాజీనామా

* షేక్ హసీనాతో ఫోన్ కాల్ తో రాజీనామాకై వత్తిడి 

షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ (76) తన అధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు మహ్మద్ షహబుద్దిన్ వెల్లడించారు. మరో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

డిసెంబర్ నాటికి స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు షేక్ హసీనా ప్రకటించిన కొద్ది రోజులకే షహాబుద్దీన్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల హసీనాతో ఆయన ఫోన్‌లో సంభాషించినట్టు నివేదికలు రాగా, ఇది అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అగ్ర నేషనలిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వం ఆగ్రహంతో ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించినట్లు తెలుస్తున్నది.

1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కీలకంగా వ్యవహరించిన మాజీ న్యాయవ్యవస్థ న్యాయమూర్తి ఏప్రిల్ 2023లో దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ తన పదవికి రాజీనామా చేశారని బంగాభవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. షహబుద్దిన్ తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మేజర్ (రిటైర్డ్) హఫీజ్ ఉద్దీన్ అహ్మద్‌కు సమర్పించినట్లు తెలిపింది.

తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని పార్లమెంట్‌కు సమర్పించిన రాజీనామా లేఖలో మహ్మద్ షహబుద్దిన్ పేర్కొన్నారు. తనకు గుండె జబ్బు, అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు ఉన్నాయని, గతంలో తన గుండెకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిపారు. ఇటీవల జరిపిన వైద్య పరీక్షల్లో ఆటోనామిక్ న్యూరోపతి అనే సమస్య ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఈ వ్యాధి కారణంగా అప్పుడప్పుడు తాను కాసేపు స్పృహ కోల్పోతుంటానని స్పష్టం చేశారు. 

ఈ అనారోగ్య సమస్యల వల్ల కలిగిన శారీరక, మానసిక అసమర్థత కారణంగా అధ్యక్ష పదవీ బాధ్యతలను నిర్వర్తించడం ఇక తనకు సాధ్యం కాదని చెప్పారు. తనకు దీర్ఘకాలిక చికిత్స అవసరమని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 50(3) నిబంధనల ప్రకారం తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు పార్లమెంట్ స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఆ తర్వాత రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి జాతీయ పార్లమెంట్ సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అందుకు 90 రోజుల గడువు ఉంటుంది. 

బ్యాంకాక్‌లో వైద్య చికిత్స పొందుతూ తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని శుక్రవారం ఢాకాకు తిరిగి వచ్చిన స్పీకర్ అహ్మద్, అధ్యక్షుడి రాజీనామాను ఆమోదించినట్లు తెలిపారు.