ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జమ్ము కశ్మీర్ అధికారులు శనివారం ప్రకటించారు. భారత వాతావరణ శాఖ నుంచి ప్రతికూల వాతావరణ సూచనలు అందడంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ఆదివారం నుంచి యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు భక్తులు యాత్ర చేపట్టకుండా అధికారులకు సహకరించాలని కోరారు.
“భారత వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ సూచనను దృష్టిలో ఉంచుకుని, యాత్రికుల భద్రత, శ్రేయస్సు దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా సాగే శ్రీ అమర్‌నాథ్ యాత్రను 19-07- 2026 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. వాతావరణ పరిస్థితులపై సమగ్రంగా సమీక్ష జరిపిన తర్వాత ఈ మార్గం నుంచి యాత్ర పునఃప్రారంభం గురించి వివరాలు త్వరలో తెలియజేస్తాం” అని కశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం నుంచి బల్తాల్, నున్వాన్/చందన్‌వారి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులు ముందుకు వెళ్లడానికి అనుమతి ఉండదని గార్గ్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు 3.76 లక్షల మందికి పైగా యాత్రికులు అమర్‌నాథ్ లింగాన్ని దర్శించుకున్నారు.
కాగా, యాత్ర సాగే బల్తాల్ బేస్ క్యాంప్, పరిసర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ సూచించింది. జులై 19 నుంచి 23 వరకు జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఈసారి జులై 02న యాత్ర ప్రారంభమైంది. ఇది 57 రోజులు సాగి ఆగస్టు 28న ముగియాల్సి ఉంది.
భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించిన అధికారులు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని, ప్రజలను కోరారు. అలాగే, పేర్కొన్న కాలంలో రైతులు తమ వ్యవసాయ పనులన్నింటినీ నిలిపివేయాలని సూచించారు. జూలై 24 నుండి వాతావరణం మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో జూలై 27 వరకు ఉరుములతో కూడిన జల్లులు, అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవంక, తీవ్రమైన వడగాల్పుల కారణంగా జూలై 6న ప్రకటించిన వేసవి సెలవులను జూలై 22 వరకు పొడిగించాలని జమ్మూ-కశ్మీర్ యంత్రాంగం నిర్ణయించింది. వాస్తవానికి సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, వడగాల్పుల తీవ్రత తగ్గకపోవడంతో సెలవులను మూడు రోజుల పాటు పొడిగించారు.

More Stories
సముద్ర గర్భంలో శత్రువుల వేటలో ఛత్రపతి శివాజీ పులిగోరుతో యుద్ధనౌక
ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయం కూల్చివేత
అయోధ్యలో ప్రత్యేక 10 రోజుల ప్రాయశ్చిత్త, శుద్ధి పూజలు