సేవ, ఐక్యత, జాతీయ చైతన్యంలను బలోపేతం చేసిన ఆర్ఎస్ఎస్ 

సేవ, ఐక్యత, జాతీయ చైతన్యంలను బలోపేతం చేసిన ఆర్ఎస్ఎస్ 
గత శతాబ్ద కాలంలో సేవ, ఐక్యత, జాతీయ చైతన్యం వంటి ఆదర్శాలను బలోపేతం చేసిన సంస్థగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను  ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్  అభివర్ణించారు. `ఆర్ఎస్ఎస్ @100: ఎ సెంచరీ ఆఫ్ సర్వీస్, యూనిటీ & శాక్రిఫైస్’ అనే పుస్తకాన్ని  శుక్రవారం ఉపరాష్ట్రపతి భవన్‌లో విడుదల చేశారు. శ్యామ్ జజు, అనుపమ్ త్రివేది రచించినఈ పుస్తకం, ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల ప్రస్థానాన్ని, దేశ నిర్మాణానికి దాని చేసిన సేవలను వివరిస్తుంది. 
 
ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా, ఐ‌జీఎన్‌సీఏ అధ్యక్షుడు రామ్ బహదూర్ రాయ్, ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర సంఘచాలక్ పవన్ జిందాల్, సహ రచయితలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి  సంఘ్‌పై ఒక తమిళ కవితను ప్రస్తావిస్తూ, అది ఆర్‌ఎస్‌ఎస్‌ను పవిత్ర గంగానదితో పోలుస్తుందని, అది ఇతరుల సంక్షేమం కోసం నిస్వార్థంగా ప్రవహిస్తూ, సంస్థ తన ప్రస్థానం పొడవునా మార్గనిర్దేశం చేసిన సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. 
 
భారతదేశ సాంస్కృతిక మూలాలు, వారసత్వం, సంప్రదాయాలను పునరుద్ధరించడం, బలోపేతం చేయడం, పునర్నిర్మించడం అనే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం సారాంశాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని ఆయన చెప్పారు.  సేవ, ఐక్యత, త్యాగం అనే ఆదర్శాలు తరతరాల స్వయంసేవక్ లకు స్ఫూర్తినిచ్చాయని, సేవ అనేది సమాజం పట్ల నిస్వార్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని, ఐక్యత భారతదేశంలోని వైవిధ్యం అంతటా బంధాలను బలపరుస్తుందని, త్యాగం అనేది శాశ్వత సంస్థలను నిర్మించడానికి అవసరమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
 
వ్యక్తిత్వ నిర్మాణానికి సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ రోజువారీ శాఖలు నాయకత్వాన్ని మరియు జాతీయ స్వభావాన్ని పెంపొందిస్తాయని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. పుస్తకం నుండి ఉటంకిస్తూ, ఆయన శాఖను “ఆత్మ కార్యశాల, ఇక్కడ యువత సహజ శక్తి జాతీయ స్వభావంగా తీర్చిదిద్దబడుతుంది” అని వర్ణించారు. 
 
భారతదేశ నాగరిక వారసత్వం, భాషలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల గర్వాన్ని పెంపొందించడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం సాంస్కృతిక కొనసాగింపును, జాతీయ చైతన్యాన్ని ప్రోత్సహించిందని ఉపరాష్ట్రపతి చెప్పారు. సంస్థ అభివృద్ధికి దోహదపడిన లక్షలాది మంది స్వయంసేవక్ ల అంకితభావాన్ని గుర్తించడానికి ఈ శత వార్షికోత్సవం ఒక అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. 
 
‘ప్రధానిగా ఒక స్వయంసేవక్: మోదీ శకం’ అనే అధ్యాయాన్ని ప్రస్తావిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక స్వయంసేవక్ నుండి ప్రధాన్ సేవక్‌గా ఎదిగిన ప్రస్థానాన్ని ఇది వివరిస్తుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. నిస్వార్థ సేవ, దేశ నిర్మాణంపై ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉన్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, ప్రధానమంత్రి తన పాలనలో సేవను, ‘దేశమే ప్రథమం’ అనే సూత్రాన్ని నిరంతరం కేంద్రంగా ఉంచారని ఆయన వివరించారు. 
 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ, జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవం స్ఫూర్తితో ప్రారంభమైన ఉద్యమంలో క్షేత్రస్థాయి కార్యకర్తలుగా ఇద్దరూ తమ ప్రజా జీవితాన్ని ప్రారంభించారని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. గంగానది ఒక చిన్న వాగుగా మొదలై మహానదిగా ఎలా మారుతుందో, ఆర్‌ఎస్‌ఎస్ ఎదుగుదలను దానితో పోలుస్తూ, ఈ సంస్థ ఒక నిరాడంబరమైన ఆరంభం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలలో ఒకటిగా ఎదిగిందని ఆయన చెప్పారు.