దివ్యాంగుల మనసు నొప్పించేలా జోకులు వేసిన ఘటనకు సంబంధించిన కేసులో కమెడియన్ సమయ్ రైనా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అబద్ధాలు చెప్పి న్యాయవ్యవస్థను అవహేళన చేశావంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకుగానూ రూ.3 లక్షల జరిమానా విధించింది. కమెడియన్ సమయ్ రైనా, యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియాతోపాటు మరికొందరు కమెడియన్లు తమ అభ్యంతరకర వ్యాఖ్యలతో దివ్యాంగుల మనసు బాధించేలా జోకులు వేశారని ఎస్‌ఎంఏ క్యూర్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం దివ్యాంగులకు కావాల్సింది గౌరవ మర్యాదలని, వారి విజయాలను కమెడియన్లు తమ వేదికల్లో చాటిచెప్పాలని సూచించింది. ఈ షోలకు దివ్యాంగులను కూడా ఆహ్వానించి వాటితో వచ్చే నిధులను బాధితుల చికిత్సకు అందజేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.
అయితే కోర్టు ఆదేశాల ప్రకారం సమయ్ రైనా తన షోలకు దివ్యాంగులను ఆహ్వానించలేదని ఎస్‌ఎంఏ క్యూర్ ఫౌండేషన్ ధర్మాసనానికి తెలిపింది. దాంతో న్యాయస్థానం కమెడియన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘సమయ్ రైనా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే గాక న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. దేశం వెలుపల ఉంటే తాము చట్టపరిధిలోకి రామని వారు భావిస్తున్నట్లున్నారు. ఇది పూర్తిగా అహంకారమే. ఇందుకు వారికి శిక్ష పడాల్సిందే’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహించింది.
సమయ్ రైనాకు రూ.10 లక్షల జరిమానా విధించింది. అయితే ఆ తర్వాత కమెడియన్ తరఫు న్యాయవాదుల అభ్యర్థనతో జరిమానాను రూ.3 లక్షలకు తగ్గించింది. మరోసారి తప్పు చేస్తే ఈ మొత్తాన్ని రూ.30 లక్షలకు పెంచుతామని హెచ్చరించింది. జరిమానాను రెండు వారాల్లోగా సుప్రీంకోర్టుకు డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

More Stories
దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక విద్య
హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్
మూడు మందిర్-మసీదు వివాదాలలో `సుప్రీం’ మధ్యవర్తిత్వం నిరాకరణ