కశ్మీర్‌ను పాక్ లో చూపిస్తారా?.. బంగ్లాపై నిప్పులు చెరిగిన భారత దౌత్యవేత్త!

కశ్మీర్‌ను పాక్ లో చూపిస్తారా?.. బంగ్లాపై నిప్పులు చెరిగిన భారత దౌత్యవేత్త!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ‘సార్క్’  అంతర్జాతీయ సెమినార్‌లో భారతదేశానికి చెందిన ఒక యువ దౌత్యవేత్త పూజా కుమారి చూపిన చొరవ, సాహసం ఇప్పుడు నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది.  భారతదేశ సరిహద్దులను తప్పుగా చిత్రీకరిస్తూ బంగ్లాదేశ్ ప్రదర్శించిన మ్యాప్‌‌‌‌పై భూభాగంలో చూపించిన ఒక మ్యాప్‌పై సదస్సు జరుగుతుండగానే ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగం” అంటూ మీటింగ్ హాల్లోనే గట్టిగా నిప్పులు చెరిగారు. 
 
ఢాకాలోని ‘బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్’ ఆడిటోరియంలో “సార్క్ పునరుద్ధరణ – ప్రాంతీయ సమగ్రత” అనే అంశంపై ఒక ఉన్నత స్థాయి సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి శామా ఒబైద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో భారత్‌లో బంగ్లాదేశ్ మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన అహ్మద్ తారిఖ్ కరీం వేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన స్క్రీన్‌పై చూపించిన దక్షిణాసియా మ్యాప్‌లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు. సదస్సులో ఉన్నవారంతా గమనిస్తున్నా మిన్నకుండిపోయిన ఆ సమయంలో అక్కడ హాజరైన భారత హైకమిషన్ సెకండ్ సెక్రటరీ పూజా కుమారి ఝా ప్రెజెంటేషన్ మధ్యలోనే గట్టిగా అభ్యంతరం తెలిపారు. 
 
“సర్.. మీరు చూపిస్తున్న మ్యాప్ తప్పు! జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో విడదీయరాని, అంతర్భాగం!” అని పూజా కుమారి ఝా స్పష్టం చేశారు.  భారత దౌత్యవేత్త నుంచి ఊహించని ఈ ప్రతిఘటనతో మాజీ హైకమిషనర్ తారిఖ్ కరీం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు. ఆ మ్యాప్‌ను కేవలం ప్రాతినిధ్య ప్రయోజనాల కోసమే వాడామని, వాస్తవ సరిహద్దులను చూపించడం తన ఉద్దేశం కాదని సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేశారు. 
 
అయినప్పటికీ పూజా కుమారి ఏమాత్రం తగ్గలేదు. “మీ వివరణ నాకు అర్థమైంది సర్.. కానీ ఇక్కడ భారతదేశ మ్యాప్ తప్పుగా ఉంది, జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే. అందుకే ఈ విషయాన్ని ఇక్కడ పాయింట్ అవుట్ చేయాల్సి వచ్చింది” అని ఆమె నొక్కి చెప్పారు.  ఆ తర్వాత కరీం ఆమెను “మీరు భారత్ నుంచా?” అని ప్రశ్నించగా “నేను పూజా కుమారి ఝా, సెకండ్ సెక్రటరీ, భారత హైకమిషన్” అని గర్వంగా పరిచయం చేసుకున్నారు. 
 
దీంతో చేసేదేమీ లేక సదరు మాజీ హైకమిషనర్ “మీ పాయింట్ నోట్ చేసుకున్నాను” అంటూ ప్రెజెంటేషన్‌ను కొనసాగించారు. ప్రస్తుతం పూజా కుమారి ఝా, బంగ్లాదేశ్ మాజీ హైకమిషనర్ మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.