ఏపీలో `పిల్లలే సంపద’ విధానంకు నాంది 

ఏపీలో `పిల్లలే సంపద’ విధానంకు నాంది 
జనం ఉంటేనే అభివృద్ధి సార్థకమవుతుందని, జనాభా ఉంటేనే నిజమైన భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడల వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటూ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచే ‘పిల్లలే సంపద’ అనే నూతన విధానానికి నాంది పలుకుతున్నట్లు  ప్రకటించారు. జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు. 
 
గతంలో జనాభా పెరిగిపోతుందన్న ఆందోళనతో ప్రభుత్వాలు నియంత్రణ వైపు అడుగులు వేశాయని ఆయన గుర్తు చేశారు. “అప్పట్లో మహిళల్లో అక్షరాస్యత పెంచడం ద్వారానే జనాభా నియంత్రణ సాధ్యమని భావించాం. ‘ఒక్కరు ముద్దు.. ఇద్దరితో సరి.. ముగ్గురు వద్దు’ అంటూ ప్రచారాలు చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధనలు కూడా తెచ్చాం. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం జనాభా నియంత్రణ కాదు.. ‘జనాభా సంరక్షణ, నిర్వహణ’ అత్యంత కీలకం” అని సీఎం స్పష్టం చేశారు.
 
యువత కేవలం ‘మైక్రో ఫ్యామిలీల’ (చిన్న కుటుంబాల) వైపు మొగ్గు చూపడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో జనాభా గణనీయంగా తగ్గిపోతోందని, భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో అంగన్‌వాడీలు, పాఠశాలల్లో చిన్నారుల సంఖ్య తగ్గిపోతోందని, వృద్ధుల సంఖ్య పెరుగుతోందని చెబుతూ ప్రతి 100 మంది జనాభాలో 89 శాతం మందికి మొదటి, రెండో సంతానం లేకపోవడం ఆలోచించాల్సిన విషయమని చెప్పారు. 
 
విశాఖపట్నం లాంటి జిల్లాల్లో సంతానోత్పత్తి రేటు అతి తక్కువగా ఉందని, ఏపీ విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉన్నా పాపులేషన్ డెన్సిటీలో వెనుకబడి ఉన్నామని, అందుకే రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. 
పిల్లలను పెంచడం అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదని, అది భార్యాభర్తలిద్దరి ఉమ్మడి బాధ్యత అని సీఎం చంద్రబాబు హితవు పలికారు. 
 
పురుషులు కూడా పిల్లల పెంపకంలో సమానంగా బాధ్యతలు పంచుకోవాలని సూచించారు. మహిళల ఆరోగ్య రక్షణ అత్యంత కీలకమని, కాన్పుల్లో అనవసర సిజేరియన్లను తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉద్యోగం చేసే మహిళల కోసం పని ప్రదేశాల్లో త్వరలోనే ‘చైల్డ్ కేర్ కేంద్రాలు’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలో వృద్ధుల కోసం ‘క్షేమం’ అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేయనున్నట్టు వెల్లడించారు.