రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ ఆస్తులు రూ 1,012 కోట్లు ఈడీ జప్తు

రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ ఆస్తులు రూ 1,012 కోట్లు ఈడీ జప్తు
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్ హెచ్ ఎఫ్ ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్ సి ఎఫ్ ఎల్)లపై జరుపుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా రూ. 1,021 కోట్ల విలువైన కొత్త ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. దీంతో, రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌కు సంబంధించిన కేసులలో జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 20,367 కోట్లకు చేరింది. 
 
అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల ఫిర్యాదుల మేరకు సిబిఐ నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ దర్యాప్తు ప్రారంభమైనట్లు ఏజెన్సీ తెలిపింది. ఈడీ దర్యాప్తు ప్రకారం, ఈ రండి కంపెనీల ద్వారా సేకరించిన రూ. 15,548 కోట్ల ప్రజాధనాన్ని, రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ నియంత్రణలో ఉన్న షెల్ సంస్థలు, గ్రూప్ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా మళ్లించినట్లు ఇప్పటివరకు తేలింది. 
 
ఈ తాజా జప్తులో, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లతో పాటు, సాసన్ పవర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ నుండి రావలసిన కొన్ని రుణ బకాయిలు కూడా ఉన్నాయని ఏజెన్సీ పేర్కొంది.
 
రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌కు సంబంధించిన పలు కేసులను ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద దర్యాప్తు చేస్తోంది. పీఎంఎల్ఏ కింద నాలుగు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులు (ఈసీఇఆర్ లు) నమోదు చేయగా, ఫెమా కింద మూడు కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ దర్యాప్తులో భాగంగా 80కి పైగా ప్రాంగణాలలో సోదాలు నిర్వహించినట్లు ఏజెన్సీ పేర్కొంది. 
 
పీఎంఎల్ఏ జప్తులతో పాటు, ఫెమా నిబంధనల కింద రూ. 77.86 కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేశారు. ఈడీ ప్రకారం, రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న ఎనిమిది మంది సీనియర్ అధికారులు, సన్నిహితులను పీఎంఎల్ఏ  కింద అరెస్టు చేసి, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. దర్యాప్తును వేగవంతం చేయడానికి ఏజెన్సీ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసింది. 
 
ఈ వారం ప్రారంభంలో, ఈ-కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో, దాని డైరెక్టర్లలో ఒకరి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ ఆపరేషన్ ఫలితంగా, రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ ప్రయోజనకరంగా కలిగి ఉన్న లేదా నియంత్రణలో ఉన్నట్లుగా ఆరోపించిన అనుమానాస్పద లావాదేవీలు, స్థిరాస్తులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది.