భార్య, ఇద్దరు పిల్లలతో సహా పోక్సో నిందితుడు ఆరుగురి దారుణ హత్య

భార్య, ఇద్దరు పిల్లలతో సహా పోక్సో నిందితుడు ఆరుగురి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలంలో ఘోరం జరిగింది. దైవలగూడ గ్రామంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తి పొడిచి హత్య చేశాడు. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో నిందితుడు హత్యలకు పాల్పడ్డాడు.  మృతుల్లో మైనర్ బాలిక కుటుంబసభ్యులతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఊరి శివారల్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేశాడు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్‌కుమార్‌పై మే 16వ తేదీన పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలిక (17)ను వేధించాడని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మే 26వ తేదీన అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే శుక్రవారం అతను జైలుపై విడుదలయ్యాడు.  

ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున తన ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్ కట్టుకున్న భార్య సరిత (33)తో పాటు ఇద్దరు కుమారులు పరీక్షిత్(4), దైవీక్షిత్(2)లను కత్తితో పీకలు కోసి దారుణంగా హతమార్చాడు. దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్ కుమార్ కట్టుకున్న భార్య, ఇద్దరు కుమారులతో పాటు, తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి లక్ష్మీ, నాయనమ్మ రుక్కమ్మలను కత్తితో నరికి చంపాడు. 

మొదట దైవాలగూడలోని సొంత ఇంట్లో భార్య సరిత (33)తో పాటు ఇద్దరు కుమారులు పరీక్షిత్ (4), దైవీక్షిత్ (2)లను కత్తితో పీకలు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం షాబాద్ పీఆర్‌ఆర్ స్టేడియం సమీపంలోని మైనర్ బాలిక (17) ఇంట్లోకి ప్రవేశించి, ఆమెను బలవంతంగా లాక్కెళ్లే క్రమంలో బాలిక తల్లి లక్ష్మీ, నాయనమ్మ రుక్కమ్మ అడ్డుపడ్డారు. దీంతో వారిద్దరినీ కత్తితో పొడి చంపాడు.

 అనంతరం బాలికను దైవాలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు సమీపంలోని తీసుకెళ్లి పీకకోసి హత్య చేశాడు. ఆ తర్వాత తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి అందర్నీ చంపేశానని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాజ్ కుమార్ చెప్పాడు. దీంతో అరుణ్ కుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

సిపి తరుణ్‌ జోషి, డిసిపి యోగేష్ గౌతమ్ ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు చిట్యాల రుక్కమ్మ (65), చిట్యాల లక్ష్మి (45), భార్య పార్వతి సరిత (30), మైనర్‌ బాలిక (17), కుమారుడు పరీక్షిత్ (3), కుమార్తె దైవిక్షిత్ (2)గా గుర్తించారు.