ఖ‌మేనీ అంత్య‌క్రియ‌ల‌కు ప్ర‌ధాని మోదీకి ఆహ్వానం

ఖ‌మేనీ అంత్య‌క్రియ‌ల‌కు ప్ర‌ధాని మోదీకి ఆహ్వానం

ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్‌ ఆహ్వానించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు  మసూద్ పెజెష్కియాన్‌ స్వయంగా లేఖ రాశారు. భారత్‌ ఇప్పటివరకు ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతల విషయంలో శాంతి, చర్చల ద్వారానే పరిష్కారం కావాలని తన వైఖరిని చెబుతూ వ‌స్తోంది.

సుమారు 86 ఏళ్ల వయసున్న అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలను వచ్చే నెలలో అత్యంత భారీ ఎత్తున నిర్వహించేందుకు ఇరాన్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ వేడుకలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ప్రారంభంలో ఇరాన్‌లోని అత్యంత పవిత్ర నగరాలుగా భావించే టెహ్రాన్, ఖోమ్ పట్టణాలలో అంతిమ సంస్కారాలకు సంబంధించిన ప్రత్యేక ప్రార్థనలు, సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

 
అనంతరం జూలై 9వ తేదీన ఖమేనీ స్వస్థలమైన మషాద్ నగరంలో ఆయన భౌతికకాయాన్ని అధికారిక లాంఛనాలతో ఖననం చేయనున్నట్లు సమాచారం. దాదాపు 36 ఏళ్ల పాటు ఆయన ఇరాన్‌కు సుప్రీం లీడర్‌గా సేవలందించారు. అంత్యక్రియలకు కోట్ల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ సైన్యాలు సంయుక్తంగా జరిపిన ఆకస్మిక దాడులు మధ్యప్రాచ్యంలో భారీ విధ్వంసానికి కారణం అయ్యాయి. ఈ యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై జరిగిన క్షిపణి దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు మరో 40 మంది ఇరాన్ అత్యున్నత సైనికాధికారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తీవ్రతకు ఖమేనీ కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నమైంది. 

ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా ఈ దాడుల్లో మరణించగా, కుమారుడు మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అలీ ఖమేనీ అకస్మాత్తుగా మరణించడంతో ఇరాన్ పాలనా యంత్రాంగంలో శూన్యత ఏర్పడకుండా అక్కడి ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ అత్యవసరంగా సమావేశమైంది. 

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమేనీ కుమారుడు మొజ్తాబాను ఇరాన్ తదుపరి నూతన సుప్రీం లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ అంతర్గత రాజకీయ బదిలీలు పూర్తి కావడంతో.. కొత్త నాయకత్వం అంతర్జాతీయంగా సంబంధాలను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే రష్యాతో పాటు భారత్‌కు కూడా అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ప్రధాని మోదీకి ఈ ఆహ్వానాన్ని పంపడం గమనార్హం.

ఇరాన్ ప్రాంతీయ భాగస్వాములకు, పొరుగు దేశాలకు ఆహ్వానాలు పంపింది. ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, లెబనాన్, రష్యా, చైనా, అనేక మధ్య ఆసియా దేశాల నుండి ప్రతినిధి బృందాలు రానున్నాయి.