ఖతార్‌లోని ప్రముఖ రాస్ లఫాన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్‌ఎన్‌సీ) పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది మృతిచెందగా, మరో 66 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలను కార్మికులు పునరుద్ధరిస్తున్న సమయంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ‘బర్జాన్’ గ్యాస్ సరఫరా విభాగంలో ఈ ప్రమాదం జరిగిందని, ఇది ఒక సాంకేతిక ప్రమాదం అని అధికారులు తెలిపారు.
మృతుల సంఖ్యను ధృవీకరిస్తూ, ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ ఈ ఘటనను ఒక విషాదంగా అభివర్ణించారు. మృతులలో భారత, పాకిస్తాన్ సంతతికి చెందిన కార్మికులు ఉన్నారని ఆయన తెలిపారు. “ఎన్నడూ జరగకూడదని నేను ఆశించిన ఒక పనిని ఈ రోజు చేయవలసి వస్తోంది. అదేంటంటే, భారత, పాకిస్తాన్ జాతీయతలు కలిగిన మన ప్రజలలో 13 మంది విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారని ప్రకటించడం,” అని ఆయన పేర్కొన్నారు.
వ్యూహాత్మక ఇంధన కేంద్రంలో కార్మికులు కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన ఈ పేలుడులో 66 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై దోహాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, మరికొందరు అదృశ్యమయ్యారని పేర్కొన్నది.
“నిన్న రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన దురదృష్టకర సంఘటన పట్ల దోహాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, అధికారుల ప్రకారం కొందరు గల్లంతయ్యారు,” అని రాయబార కార్యాలయం తెలిపింది. బాధిత భారత పౌరులకు, వారి బంధువులకు పూర్తి మద్దతు ఇస్తామని కూడా ఆ రాయబార కార్యాలయం హామీ ఇచ్చింది.
“ఈ సవాలుతో కూడిన, క్లిష్ట సమయంలో, భారత రాయబార కార్యాలయం, ఖతార్‌లోని యావత్ భారతీయ సమాజం ఖతార్ ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, గల్లంతైన వారు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము,” అని అది జోడించింది. సహాయం అవసరమైన వారు తమ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని రాయబార కార్యాలయం కోరింది.
కాగా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ దోహాలో ఈ పేలుడు ధాటికి కిటికీలు కంపించాయని, స్థానికులు భయాందోళనలకు గురయ్యారని సమాచారం. ఈ ప్రమాదం కారణంగా ఖతార్ ఎల్‌ఎన్‌సీ ఎగుమతి సామర్థ్యానికి ఎలాంటి ఆటంకం లేదని, పర్యావరణానికి ఎటువంటి హాని జరుగలేదని ఖతార్ ఇంధన మంత్రిత్వశాఖ తెలిపింది.

More Stories
ఇరాన్ చమురుపై ఆంక్షలు తాత్కాలికంగా సడలింపు
ఇరాన్ ఒప్పందం కోసం 60 రోజుల రోడ్‌మ్యాప్ ఖరారు
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా