‘ఆపరేషన్ టైగర్’ విజయవంతంగా పూర్తి

‘ఆపరేషన్ టైగర్’ విజయవంతంగా పూర్తి
‘ఆపరేషన్ టైగర్’ కింద శివసేన (యూబీటీ) శిబిరం నుండి ఫిరాయింపులపై ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే మరిన్ని పరిణామాలు చోటుచేసుకోనున్నాయని సూచించారు. 
 
సంయుక్త విలేకరుల సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ, “ఆపరేషన్ విజయవంతమైంది, బృందం చాలా మంచి ఆరోగ్యంతో ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన వారు అలా చేయాలి,” అని హితవు చెప్పారు. 2022లో తన తిరుగుబాటుతో అవిభక్త శివసేనను చీల్చిన షిండే, తాను ఏ ఆపరేషన్‌ను అసంపూర్తిగా వదిలిపెట్టనని స్పష్టం చేశారు.
 
“నేను ఏ ఆపరేషన్ చేపట్టినా, దాన్ని పూర్తిగా పూర్తి చేస్తాను. మేము ఇదివరకే నిరూపించాము,” అని ఆయన తెలిపారు. ఆపరేషన్ టైగర్ స్థితి గురించి అడగ్గా, షిండే ఇలా వ్యాఖ్యానించారు, “మీకు త్వరలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఎంపీలను దూషించారు, ఆ తర్వాత మీరు (థాకరే వర్గం) వారిని (తిరిగి) కోరుకుంటున్నారు. అక్కడ రసాయన లోచా ఉంది” అంటూ ఎద్దేవా చేశారు.
 
శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు – సంజయ్ దీనా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, భావుసాహెబ్ వాక్చౌరే, నాగేష్ పాటిల్-అష్టికర్, నింబాల్కర్ – న్యూఢిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశానికి గైర్హాజరైన కొద్ది రోజులకే ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. దీంతో వారు షిండే నేతృత్వంలోని సేనలోకి ఫిరాయించవచ్చనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
 
సేన (యూబీటీ)లో తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతను తప్పించుకోవాలంటే, ఒక తిరుగుబాటు వర్గానికి కనీసం ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం. ఆదివారం, ఈ ఆరుగురు ఎంపీలలో కనీసం ఇద్దరు  ఏకనాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనలోకి మారుతున్నట్టు అస్తికార్‌, నింబాల్కర్‌ ధ్రువీకరించారు. 
 
తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసిన ఒక వీడియోలో అస్తికార్‌ మాట్లాడుతూ తాను సిద్ధాంతాలతో ఎలాంటి రాజీ పడలేదని, కేవలం ఒక శివసేన నుంచి మరొక శివసేలోకి వెళ్లానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండటం వల్ల అభివృద్ధి నిధుల కొరత, పార్టీ కార్యకర్తల పనులు చేయించలేకపోవడం వంటి నష్టాలను తన ఫిరాయింపునకు ముఖ్య కారణాలుగా ఆయన పేర్కొన్నారు.

“నేను, కొందరు ఇతర ఎంపీలు జూన్‌ 18 వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గురువారం నుంచి మాపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇక ఇక్కడ ఉండటంలో అర్థం లేదని మేము భావించాం” అని తెలిపారు.