నేటి యాంత్రిక జీవనంలో పిల్లలంతా ఇంటి భోజనాన్ని కాదని, రంగు రంగుల ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆరోగ్యానికి హాని చేసే ఈ కమర్షియల్ ఫుడ్ కల్చర్ ట్రెండ్‌ను బ్రేక్ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేవలం చదువే కాకుండా, పిల్లల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను, కుటుంబ విలువలను పెంచి పోషించాలనే సంకల్పంతో స్కూల్ యాజమాన్యం ఈ లంచ్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసింది.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో విద్యార్థుల తల్లులు ఉత్సాహంగా పాల్గొని, తమ పిల్లలకు ఇష్టమైన సాంప్రదాయ వంటకాలను స్వయంగా ఇంట్లోనే ఎంతో ప్రేమతో తయారు చేసుకుని పాఠశాలకు తీసుకువచ్చారు. సాంప్రదాయ రీతిలో నేలమీదనే కూర్చుని తల్లులంతా తమ పిల్లల పక్కన చేరి, కబుర్లు చెపుతూ చేతితో గోరుముద్దలు తినిపిస్తుంటే స్కూల్ ప్రాంగణమంతా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని తలపించింది. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎంతోమంది తల్లులు ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు.
అమ్మ చేతి వంటలోని అమృతాన్ని, ఆత్మీయతను పిల్లలకు పరిచయం చేసిన ఈ ‘మాతృ హస్త భోజనం’ అందరి హృదయాలను హత్తుకుంది. ఈ బిజీ లైఫ్‌లో పిల్లలతో కలిసి ఇలా ప్రశాంతంగా భోజనం చేసే మంచి అవకాశాన్ని కల్పించినందుకు తల్లులంతా స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటు విద్యార్థులకు, అటు తల్లిదండ్రులకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకంగా ఈ రోజు నిలిచిపోతుందని పాఠశాల ప్రతినిధులు పేర్కొన్నారు.
శ్రీ విద్యారణ్య ఇంటర్ నేషనల్ స్కూల్ లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని పాఠశాల సెక్రటరీ విశ్వేశ్వరరావు తెలిపారు. ఇటువంటి సాంప్రదాయాలతో పిల్లల్లో భారతీయ విలువల పట్ల ఆకర్షణ కలుగుతుందని అన్నారు. అందుచేతనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ తరం పిల్లలకు కుటుంబ విలువలను తెలిపేందుకు ఈ చొరవ తీసుకొన్నట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ రమాదేవి వెల్లడించారు. పాఠశాల పిలుపు మేరకు స్పందిస్తూ వందల సంఖ్యలో తల్లులు తరలి వచ్చారని వివరించారు. మాతృమూర్తులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని రమాదేవి చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల కోశాధికారి పసర్తి మల్లయ్య, సభ్యులు వెంకటస్వామి, రాజిరెడ్డి స్ఫూర్తినిచ్చారు.

More Stories
`మానస’లో ఆకట్టుకున్న ప్రత్యేక పిల్లల యోగా, హరిత కార్యక్రమాలు
యోగా కేవలం వ్యాయామం కాదు.. అది జీవన విధానం
సింగరేణి కాంగ్రెస్ పాలకులకు ‘లంకెబిందె’