మైనింగ్ వివాదంలో బీజేపీ నేతతో సహా ముగ్గురు సజీవ దహనం

మైనింగ్ వివాదంలో బీజేపీ నేతతో సహా ముగ్గురు సజీవ దహనం
ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆధిపత్య పోరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో అత్యంత భయంకరమైన నరమేధానికి దారితీసింది. పాత కక్షలను మనసులో పెట్టుకుని పక్కా వ్యూహంతో దాడి చేసిన ప్రత్యర్థులు ఒక ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కారును నడిరోడ్డుపై ట్రక్కుల మధ్య లాక్ చేశారు. ఆపై కారుపై పెట్రోల్ కుమ్మరించి సజీవ దహనం చేశారు. 
 
ఈ ఘోర అగ్నిప్రమాదంలో స్థానిక బీజేపీ అగ్రనేత, మాజీ జనపద్ పంచాయతీ అధ్యక్షుడు భరత్ సింగ్ అలియాస్ లల్లా సింగ్ సహా ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్ర గాయలపాలై ప్రస్తుతం ఆస్పత్రితో చికిత్సపొందుతున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కిరాతక ఉదంతం సోన్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగైన్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో ఇసుక క్వారీ కాంట్రాక్ట్ భరత్ సింగ్ కుటుంబానికి దక్కింది. సోన్హత్, కైలాష్‌పూర్, తేలిముడ పరిసరాల్లో ఇసుక రవాణా, అక్రమ వసూళ్లపై భరత్ సింగ్ వర్గానికి, మరో బీజేపీ నేత మనోజ్ త్రిపాఠి కుటుంబానికి మధ్య గత కొన్ని నెలలుగా తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తోంది. 
 
మంగళవారం రాత్రి ఈ గొడవను సర్దుమణిగేలా చేసేందుకు, ఒక సెటిల్‌మెంట్ మాట్లాడటానికి భరత్ సింగ్ తన అనుచరులతో కలిసి ఫార్చ్యూనర్ కారులో బయలుదేరారు. కానీ అప్పటికే మార్గమాధ్యంలో మాటు వేసిన త్రిపాఠి వర్గం  భరత్ సింగ్ ప్రయాణిస్తున్న కారు నౌగైన్ గ్రామానికి చేరుకోగానే తమ టిప్పర్ ట్రక్కులను ఆ ఎస్‌యూవీకి ముందు, వెనుక అడ్డుగా పెట్టి కారు అంగుళం కూడా కదలకుండా లాక్ చేసేశారు. 
 
గతంలో కాంగ్రెస్‌లో ఉండి, భూపేష్ బఘేల్ ప్రభుత్వ హయాంలో బీజేపీలో చేరిన భరత్ సింగ్ కొరియా జిల్లా మైనింగ్ నెట్‌వర్క్‌లో అత్యంత పట్టున్న నాయకుడు.  మైనింగ్ ఏరియాలో భ‌ర‌త్ సింగ్ అంటే అంద‌రికీ భ‌య‌మే. త‌న ఫార్చూన‌ర్ వాహ‌నానికి అత‌ను హూట‌ర్ పెట్టుకుని తిరిగేవాడు.  నలుగురు ప్రధాన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నారు.
నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన శిక్షలు పడేలా చేస్తామని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్  స్పష్టం చేశారు. అయితే భ‌ర‌త్ సింగ్ కారు అగ్నిప్ర‌మాదానికి ఎలా గురైందో తెలియ‌ద‌ని పోలీసులు చెబుతున్నారు. ఆ కోణంలో ఇంకా ద‌ర్యాప్తు చేప‌డుతున్నామ‌ని తెలిపారు.