చికెన్స్ నెక్‌ కారిడార్‌‌ కేంద్రానికి బెంగాల్ బదిలీ

చికెన్స్ నెక్‌ కారిడార్‌‌ కేంద్రానికి బెంగాల్ బదిలీ
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చికెన్స్ నెక్‌ (సిలిగురి కారిడార్)లోని 120 ఎకరాల భూమిని కేంద్రానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలను ఈశాన్య భారత్‌తో కలిపే ఏకైక భూమార్గం సిలిగురి కారిడార్. సంఘర్షణ లేదా సంక్షోభ సమయాల్లో భారతదేశానికి కాకుండా బంగ్లాదేశ్‌కు ఇది మద్దతుగా నిలుస్తుంది. 
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సువేంద్ అధికారి నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఏడు జాతీయ రహదారులను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ), నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లకు అప్పగించాలని నిర్ణయించింది.  క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో పలు జాతీయ రహదారి ప్రాజెక్టులపై దీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది.
 
ఎన్ హెచ్-31, ఎన్ హెచ్-33, ఎన్ హెచ్-312లతో సహా కీలక రహదారుల బాధ్యత ఇకపై ఎన్ హెచ్ ఏ ఐ పరిధిలోకి వెళ్తాయి. సేవక్–కరోనేషన్ బ్రిడ్జ్ మార్గం, హసిమారా–జైగావ్ మార్గం, చాంగ్రాబంధా కారిడార్ వంటి ప్రాజెక్టులను ఎన్ హెచ్ ఐ డి సి ఎల్ పర్యవేక్షిస్తుంది. ఈ ప్రాజెక్టులు దాదాపు ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయని సమాచారం. 
 
ఇప్పుడు అనుమతి లభించడంతో కేంద్ర సంస్థలు రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయగలవు. ఇది ఉత్తర బెంగాల్‌తో అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని, బంగ్లాదేశ్, భూటాన్ సరిహద్దులతో సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. డార్జిలింగ్ కొండలు, డూయార్స్, ఇతర సరిహద్దు ప్రాంతాలలో రవాణా మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
 
పశ్చిమ్ బెంగాల్‌లోని ప్రత్యేక భౌగోళిక ప్రాంతమైన చికెన్స్ నెక్ ‌ను సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. దాదాపు 22 కీ.మీ. వెడల్పు, 200 కీ.మీ. పొడవుతో ఇది ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయలను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో కలిపే ఏకైక భూభాగం.  కోడి మెడ ఆకారంలా ఉండటంతో దీనికి చికెన్స్ నెక్ అనే పేరు వచ్చింది. ఉత్తరాన భూటాన్, తూర్పున బంగ్లాదేశ్, పశ్చిమాన నేపాల్‌తో ఇది సరిహద్దులను పంచుకుంటుంది.
అందుకే ఈ కారిడార్ భారత్‌కు వ్యూహాత్మకంగా, రాజకీయంగా అత్యంత కీలకం.  చికెన్స్ నెక్ (సిలిగురి కారిడార్) సమీపంలో కేంద్ర ప్రభుత్వానికి మరింత భూమిని అప్పగించడం అంటే దేశంలోని అత్యంత సున్నితమైన భౌగోళిక చోక్‌పాయింట్‌లో భారీ భద్రత, రక్షణ లాజిస్టిక్స్, రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడమే కాగలదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారీ రైల్వే విస్తరణ ప్రణాళికకు వీలు కల్పించడమే భూమి అప్పగింత వెనుక ప్రాథమిక ఉద్దేశం.
 
ప్రస్తుతం ఉన్న డబుల్-ట్రాక్ రైల్వేను ఆరు-ట్రాక్ వ్యవస్థగా ఉన్నతీకరించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ కొత్త ట్రాక్‌లలో రెండు, టీన్ మైల్ హాట్, రంగపాని స్టేషన్ల మధ్య ఉపరితలం నుంచి 20–24 మీటర్ల లోతులో 40 కిలోమీటర్ల భూగర్భ రైల్వే నిర్మాణం చేపట్టనున్నారు. రైలు మార్గాలను భూగర్భంలో నిర్మాణం వల్ల వైమానిక, భారీ ఫిరంగి లేదా డ్రోన్‌ దాడుల వంటి బాహ్య ముప్పు నుంచి భారత సైనిక, సరఫరా లాజిస్టిక్స్‌కు రక్షణ లభిస్తుంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి ఏదైనా ముప్పు ఏర్పడితే తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోడానికి వీలు కల్పిస్తుంది.