నీట్ లీకేజీ సూత్రధారి కులకర్ణి పుణేలో అరెస్ట్

నీట్ లీకేజీ సూత్రధారి కులకర్ణి పుణేలో అరెస్ట్

దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్- యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారి పీవీ కులకర్ణి అరెస్టయ్యాడు. రసాయన శాస్త్రంలో లెక్చరర్‌ అయిన ఆయనను పుణేలో శుక్రవారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీయే) తరఫున ప్రశ్నపత్రాలు రూపొందించే బృందలో ఒకడైన కులకర్ణి మే 3న జరిగిన నీట్ పేపర్‌ను లీక్ చేశాడు. ప్రైవేట్ ట్యూషన్ల సమయంలోనే కులకర్ణి నీట్ పేపర్‌ను లీక్ చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

“మహారాష్ట్రలోని లాతూరు ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణి రసాయన శాస్త్రంలో నిపుణుడు. ఆయన గత కొన్నేళ్లుగా నీట్ ప్రశ్నాపత్రం రూపొందించే అధికారిక నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం పుణెలో నివసిస్తున్నారు. నీట్ ప్రశ్నపత్రాలను చూడడానికి ఆయనకు యాక్సెస్ ఉంది. అయినప్పటికీ ఆయన తన సొంత ఇంటిలోనే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించినట్లు సీబీఐ దర్యాప్తులో తెలిసింది” అని సీబీఐ అధికారులు తెలిపారు.

ఈ వ్యవహారంపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, “ఈ కేసులో మరో నిందితురాలైన మనీషా వాఘ్మారే సాయంతో ప్రొఫెసర్ కులకర్ణి 2026 ఏప్రిల్ చివరి వారంలో పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి, తన కోచింగ్ సెంటర్లో చేర్చుకున్నారు. తరువాత నీట్-యూజీ పరీక్షలో వచ్చే ప్రశ్నలను, వాటి ఆప్షన్లను, సరైన సమాధానాలను స్వయంగా డిక్టేట్ చేశారు” అని వెల్లడించారు. 

ఆయన చెప్పిన ప్రశ్నలను విద్యార్థులు తమ నోట్బుక్స్లో చేతిరాతతో రాసుకున్నారని, మే 3వ తేదీన జరిగిన నీట్-యూజీ అసలు పరీక్ష పత్రంతో ఈ నోట్స్ అచ్చుగుద్దినట్లు సరిపోలిందని పేర్కొన్నారు. కాగా, మనీషా వాఘ్మారేను సీబీఐ మే 14న అరెస్టు చేసింది. నాలుగేళ్ల క్రితం ఒక ప్రతిష్ఠాత్మక కళాశాల నుంచి పదవీ విరమణ చేశారు.  కులకర్ణిని మరింతగా విచారిస్తే ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు? ఎంత మొత్తంలో డబ్బు చేతులు మారింది? అనే వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.