ప్రభుత్వ అధికారులు, మంత్రుల కాన్వాయ్‌లలోని వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులకు కేటాయించే ఇంధన కోటాలో 20 శాతం కోత విధించారు. నెలకు 200 నుంచి 250 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ పొందుతున్న వారికి కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధనాన్ని ఆదా చేయడానికి ఢిల్లీలో త్వరలోనే ఒక రోజును ‘వాహన రహిత దినోత్సవం’ (కార్-ఫ్రీ డే) గా జరుపుకోనున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. వాహన భత్యాలు పొందుతున్న అధికారులు మెట్రో లేదా బస్సులను ఉపయోగిస్తే, వారికి 10 శాతం అదనపు భత్యం అందించనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా బస్ రూట్స్ కూడా నిర్దేశించనున్నారు. ముఖ్యంగా, సోమవారం నాడు ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు మెట్రో రైళ్లలోనే ప్రయాణించాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కార్యాలయాలకు రాకపోకలు తగ్గించే క్రమంలో, ప్రభుత్వంలోని అన్ని శాఖల సమావేశాలలో కనీసం 50 శాతం సమావేశాలను వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, న్యాయవ్యవస్థలో కూడా రద్దీని తగ్గించేందుకు వీలుగా కోర్టులలో జరిగే చాలా వరకు విచారణలను వర్చువల్ మోడ్‌లోనే నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం కోర్టులను అభ్యర్థించింది.
ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా రాబోయే మూడు నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి పెద్ద అధికారిక కార్యక్రమాలను, ఈవెంట్లను నిర్వహించబోదని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో, దేశ రాజధానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఢిల్లీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేస్తుందని రేఖా గుప్తా వెల్లడించారు.

More Stories
సంక్షోభాల నివారణలో స్థిరత్వాన్ని అందించే బ్రిక్స్ కూటమి
రాహుల్ గాంధీ ఆదాయం, విదేశీ పర్యటనల ఖర్చుల్లో వ్యత్యాసం
కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధమైన ఢిల్లీ హైకోర్టు