శబరిమల కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌

శబరిమల కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌

శబరిమల ఆలయంతో సహా వివిధ మతపరమైన ప్రదేశాల్లో మహిళల పట్ల వివక్ష, మతస్వేచ్ఛపై దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదావేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును 16 రోజుల పాటు విచారణ జరిపింది.  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు సి.ఎస్. వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గీ, ఇందిరా జైసింగ్‌ల వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

విచారణకు ముందు శబరిమల ఆలయంలోకి రుతుక్రమం వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సమర్థించాలని కేంద్రం లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసింది. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించినది అయినందున న్యాయసమీక్ష పరిధిలోకి రాదని పేర్కొంది.  2018 సెప్టెంబర్‌లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4:1 మెజారిటీతో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.

10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని రద్దు చేసింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆ ఆచారం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అయితే ఈ అంశంపై పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.  దీంతో 2019 నవంబర్‌లో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ వివాదంతోపాటు ఇతర మతాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన అంశాలను 9మంది సభ్యులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేసింది.

శబరిమలతో పాటు ముస్లిం మహిళలకు మసీదులు, దర్గాల్లో ప్రవేశం, పార్సీ మహిళలు అగియారీలోకి ప్రవేశించడం వంటి అంశాలను కూడా ధర్మసనానికి అప్పగించింది.  2020 మే 11న శబరిమల కేసులో చట్టపరమైన ప్రశ్నలను విచారణ కోసం విస్తృత ధర్మాసనానికి నివేదించే అధికారం తమ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఉందని పేర్కొంది. ఈ కేసులో తుది విచారణ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమవుతుందని, అలాగే, ఏప్రిల్ 22న ముగుస్తుందని సుప్రీం చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశ హక్కు సంబంధించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయంలో మహిళల ప్రవేశ హక్కును కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. అయితే, ఆ విషయంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ, అసలు పిటిషన్‌ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించింది. 

దానికి సమాధానంగా 1990లో కేరళ హైకోర్టులో తంత్రి (ప్రధాన పూజారి) అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు వెల్లడించిన పలు పత్రికా కథనాల ద్వారా ఈ పిల్‌ వేసినట్లు పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా, పిటిషనర్‌ ఈ విషయంపైనే ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. అసలు శబరిమల ఆలయంతో మీకేం సంబంధముందని పిటిషనర్‌ను ప్రశ్నించారు. లాయర్స్‌ అసోసియేషన్‌, బార్‌ సంక్షేమం, దేశం కోసం పని చేయకుండా ఇటువంటి విషయాలపై ఎందుకు ఉత్సుకత చూపుతోందని విచారం వ్యక్తం చేశారు.