పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడిలో 9 మంది మృతి

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడిలో 9 మంది మృతి

పాకిస్తాన్‌‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి 9 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌‌లోని లక్కీ మార్వత్ జిల్లాలో ఈ దాడి జరిగిందని స్థానిక పోలీస్ చీఫ్ అజ్మత్ ఉల్లా తెలిపారు. ‌మృతుల్లో ఇద్దరు ట్రాఫిక్‌ ‌పోలీసు అధికారులు కూడా ఉన్నారు. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారని ఉల్లా చెప్పారు. 

ఈ దాడి పోలీసు అధికారులే లక్ష్యంగా జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే ఈ దాడి వెనుక తమ హస్తం లేదని తాలిబన్‌ ఉగ్రవాద సంస్థ స్పష్టం చేసింది.   అయితే ఈ దాడికి ‘తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్’ లేదా టిడిపిగా పిలువబడే పాకిస్తాన్ తాలిబాన్‌ కారణమని అధికారులు స్పష్టం చేశారు. పలు పేలుడు పదార్థాలు కలిగిన ఆటో రిక్షా ఒకటి నౌరంగ్ బజార్ ప్రాంతంలోని ఫట్టాక్ చౌక్ ప్రాంతంలోకి దూసుకొచ్చి, పేలిపోయింది. ఆటోలోని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

పాకిస్తాన్ వాయువ్య ప్రాంతం, ఖైబర్ పక్తుంఖ్వా పరిధిలోని లక్కి మార్వాట్ జిల్లాలో మంగళవారం ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ప్రాంతంలో మిలిటరీ కదలికలు ఎక్కువగా ఉన్నప్పటికీ దాడి జరగడం విశేషం.  సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్ని స్థానిక సరాయ్ నౌరంగ్ పరిధిలోని ఆస్పత్రికి తరలించారు. 

తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడి వల్ల సమీపంలోని షాపులన్నీ ధ్వంసమయ్యాయి. రెండు రోజుల క్రితం కూడా పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక చెక్‌పోస్ట్‌పై జరిగిన దాడిలో దాదాపు 21 మంది పోలీసులు మరణించారు.

ఈ ఘటనపై పాకిస్తాన్‌ ‌ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో మృతులకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధిత సంస్థలన్నీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నాయి. దేశంలో శాంతి, అభివృద్ధికి ఉగ్రవాదులు ఆటంకం కలిగించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. దర్యాప్తును త్వరగా పూర్తి చేసి, దోషులకు శిక్ష పడేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.