ఏడాది పాటు బంగారం వద్దు, పెట్రోల్ డీసెల్ ఆదా, వర్క్ ఫ్రం హోమ్

ఏడాది పాటు బంగారం వద్దు, పెట్రోల్ డీసెల్ ఆదా, వర్క్ ఫ్రం హోమ్
* విదేశీ ప్రయాణాలు వద్దు.. పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా ప్రధాని పిలుపు 
 
పశ్చిమ ఆసియా సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు.  కార్ పూల్స్, ప్రజా రవాణాను ఎంచుకోవడం, విదేశీ ప్రయాణాలను నివారించడం, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాల వంటి కరోనా-సమయ చర్యలను పాటించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో పౌరులు తమ వంతు పాత్ర పోషించాలని ప్రధాని కోరారు. 
 
పెళ్లిళ్లు, ఆర్బాటాల కోసం ఏడాది పాటు బంగారు నగలు కొనకుండా ఉండాలని కోరుతూ దీని వల్ల దేశ విలువైన విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణించకుండా ఉంటాయని, ఈ విషయాలపై తక్షణం అంతా దృష్టి పెట్టాల్సి ఉందని హైదరాబాద్ బహిరంగసభలో చెప్పారు.  అంతర్జాతీయ ఘర్షణల వల్ల ఏర్పడిన ప్రపంచ ఆర్థిక అంతరాయాలు, సరఫరా గొలుసు సవాళ్లు, పెరుగుతున్న ధరలను ఎదుర్కోవడంలో భారతదేశానికి సహాయపడటానికి సామూహిక భాగస్వామ్యం అవసరమని తెలిపారు.   
 
సాధ్యమైనంత వరకు రైల్వే సరుకు రవాణాను వినియోగించాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కోరారు.  మరోవైపు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని చెబుతూ విదేశీ పర్యటనలు, విదేశీ వస్తువుల కొనుగోళ్లు తగ్గించాలని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. “వోకల్ ఫర్ లోకల్”ను మరింత బలంగా అమలు చేయాలని, రోజువారీ జీవితంలో విదేశీ ఉత్పత్తుల స్థానంలో స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించారు.


ప్రపంచ సంక్షోభాల సమయంలో ప్రతి పౌరుడు దేశహితం కోసం కట్టుబడి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. ఇది ఒక్క ప్రభుత్వానికి, ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశానికి సంబంధించిన బాధ్యత అని అన్నారు. ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంస్థ దేశ ప్రయోజనాల కోసం ఏకమై పనిచేస్తే భారత్ ప్రతి సంక్షోభాన్ని జయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 
ముడి చమురు ధరలు మండుతున్నాయి, ఆర్థిక అనిశ్చిత ఉందని పేర్కొంటూ ఈ దశలో ఇంధన ఆదా పరిరక్షణ అత్యంత అవసరం, ఇది జాతీయ బాధ్యత అని స్పష్టం చేశారు. 


రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి నాశనం అవుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువుల వినియోగాన్ని 25% నుంచి 50% వరకు తగ్గించి సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు సూచించారు. డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి పంపులను ఉపయోగించాలని కూడా కోరారు.

ప్రస్తుతం భారత్ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ  పేర్కొన్నారు. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఉక్రెయిన్ యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయని చెప్పారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా రైతులకు భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తోందని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో రూ.3000 ఉన్న ఎరువుల సంచిని భారత రైతులకు రూ.300 లోపే అందిస్తున్నామని వెల్లడించారు.