యుద్ధం ముగింపుపై అమెరికా-ఇరాన్‌ చర్చలు ఓ కొలిక్కి!

యుద్ధం ముగింపుపై అమెరికా-ఇరాన్‌ చర్చలు ఓ కొలిక్కి!
ప్రపంచ దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ‘అమెరికా-ఇరాన్‌’ యుద్ధం విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధం ముగింపుపై అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో 48 గంటల్లో ఇరాన్‌ యుద్ధానికి ‘ఎండ్‌ కార్డ్‌’ పడుతుందని బుధవారం అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 
 
ఇరు పక్షాల మధ్య 14 అంశాలతో కూడిన ఒక అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) ముసాయిదా రూపొందినట్లు తెలిసింది. ఇది ఇంకా తుదిరూపం దాల్చకపోయినప్పటికీ, గతంలో లేనంతగా ఈసారి చర్చలు ముందుకుసాగాయి. ఇరాన్‌ నాయకత్వం 48 గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించవచ్చునని, అన్ని దేశాలకు హొర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరువనున్నదని ‘ఆక్సియోస్‌’ న్యూస్‌ తెలిపింది.
 
అంతేగాక ముసాయిదా ఒప్పందంలో భాగంగా అణు కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు ఇరాన్‌ అంగీకరించినట్టు సమాచారం. ఇదంతా ఒక కొలిక్కి వచ్చాక యుద్ధాన్ని ముగించడానికి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇరాన్‌పై ఆంక్షల తొలగింపు, అణు కార్యక్రమం నిలిపివేత, హొర్ముజ్‌ జలసంధి, లోతైన చర్చలకు 30 రోజుల గడువు ప్రధాన అంశాలుగా ప్రతిపాదిత ఒప్పందం రూపొందినట్లు తెలిసింది. 
 
ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఇందుకు ప్రతిగా అమెరికా క్రమంగా తన ఆంక్షలను సడలించి, ఇరాన్‌కు చెందిన బిలియన్‌ డాలర్ల ఆస్తులను విడుదల చేస్తుంది  అంతకు ముందు, హర్మూజ్ జలసంధి మీదుగా రాకపోకలు సాగించే నౌకలకు భద్రత కల్పిస్తామంటూ  ప్రకటించిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ రెండు రోజులకే ఆపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 
 
మధ్యప్రాచ్యంలో ఘర్షణలకు ముగింపు పలికేందుకు ఇరాన్‌తో జరుపుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి కన్పిస్తోందని, ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను నిలిపివేస్తున్నానని ట్రంప్ తెలియజేశారు.   “పాకిస్తాన్, మరికొన్ని దేశాల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై సాగించిన పోరులో సాధించిన సైనిక విజయాలను దృష్టిలో పెట్టుకొని .ఇరాన్ ప్రతినిధులతో పూర్తి, తుది ఒప్పందం కుదుర్చుకునే దిశగా గొప్ప పురోగతి సాధించామన్న వాస్తవాన్ని గమనంలో ఉంచుకొని ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను కొద్ది కాలం పాటు నిలిపివేస్తున్నాను” అని ట్రంప్ ప్రకటిచారు. 
 
“ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఒప్పందం ఖరారవుతుందా, సంతకాలు జరుగుతాయా అనే విషయాలను పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం” అని వివరించారు.  ఆపరేషన్ ఫ్రీడమ్‌ను నిలిపివేస్తున్నామని ట్రంప్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో  ఫిబ్రవరి 28న ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ తన లక్ష్యాలను సాధించింది కాబట్టి అది ముగిసిందని తెలిపారు. 
ఇరాన్‌తో చర్చలలో గొప్ప పురోగతి సాధించామంటూ ట్రంప్ చేసిన ప్రకటనతో చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ 2.8 శాతం తగ్గింది. బ్యారల్ చమురు ధర 106.7 డాలర్లు పలికింది.