118 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లేఖ‌లు కావాల్సిందే

118 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లేఖ‌లు కావాల్సిందే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు గడుస్తున్నా  ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) మేజిక్ ఫిగర్‌కు చేరువలో ఉన్నప్పటికీ  గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మాత్రం ఇంకా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించలేదు. 
 
తాజాగా విజయ్ మళ్లీ ఆయన దగ్గరికి వెళ్లినా 118 మంది ఎమ్మెల్యేల మెజార్టీతోనే రావాలని చెప్పినట్లు తెలుస్తోంది.  టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం  లోక్‌భ‌వ‌న్  ఒక అధికారిక ప్రకటనలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ మద్దతు ప్రస్తుతం టీవీకే వద్ద లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టం చేశారని తెలిపారు. 
ఈ సందర్భంగా విజయ్‌కు గవర్నర్ పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
బుధవారం సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యకు అదనపు బలం ఏమైనా పెరిగిందా? మెజార్టీ మార్క్‌ 118 అయినప్పుడు 113 మందితో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? మీకు మద్దతు ఇవ్వడానికి ఇతర పార్టీలు ఏవైనా ముందుకు వచ్చాయా? అని అడిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాను బలపరీక్షకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా గవర్నర్‌కు విజయ్ వెల్లడించినట్లు తెలిపాయి.
 
ఇందులో భాగంగా అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్  విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు. కాగా అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని, ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాలని డీఎంకే, సీపీఐ, వీసీకే పార్టీలు గవర్నర్‌‍కు విజ్ఞప్తి చేశాయి.
అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని సూచించాయి.  విజయ్ ప్రమాణ స్వీకారం చేయకముందే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఒత్తిడి చేయడం సరికాదని సిపిఐ స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో విజయ్‌కు ఇంకా కనీసం ఆరుగురు శాసనసభ్యుల మద్దతు అవసరం. దీంతో వీసీకే, సీపీఐ, సీపీఎం వంటి చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నిస్తున్నది.
ఈ క్రమంలోనే  లోక్‌భ‌వ‌న్ నిర్ణయాల వెనుక బీజేపీ హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలను బీజేపీకి తీవ్రంగా ఖండించింది.  విజయ్ మెజారిటీ నిరూపించుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ తప్పనిసరిగా ఆహ్వానిస్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి స్పష్టం చేశారు.