మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా హగ్ చేసుకోబోయిన కాంగ్రెస్ నేత 

మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా హగ్ చేసుకోబోయిన కాంగ్రెస్ నేత 
మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా కౌగిలించుకునేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రయత్నించడం,   ఆమె ఇబ్బందిపడటంతో పాటు ఆయనను తోసి ముందుకు వెళ్లడం కేరళ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. పైగా, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే శాసనసభా పార్టీ నేత ఎంపిక విషయమై కొత్తగా ఎన్నికైన ఎమ్యెల్యేల సమావేశం సందర్భంగా ఈ ఘటన జరగడం పెను దుమారం రేపుతోంది. 
 
మహిళా ఎమ్మెల్యే పట్ల సీనియర్ నేత అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శల జల్లు వెల్లువెత్తుతున్నాయి. కొల్లాం నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మహిళా నేత బిందు కృష్ణ పట్ల సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
 
కొల్లాం ఎమ్మెల్యేగా గెలుపొందిన బిందు కృష్ణ.. ఎన్నికల ఫలితాల తర్వాత  కీలక శాసనసభా పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు కేపీసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రాంగణంలోకి ప్రవేశించిన ఆమె చేతులు జోడించి అక్కడున్న నేతలకు నమర్కించారు. ఈ సందర్భంగా బిందు కృష్ణకు పార్టీ నేతలు అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు.  ఈ క్రమంలోనే సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. 
అందరూ చూస్తుండగానే ఆమెను బలవంతంగా కౌగిలించుకునేందుకు ప్రయత్నం చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని చెరియన్ ఫిలిప్ ఆమెను బలవంతంగా హగ్ చేసుకునేందుకు ప్రయత్నించగా ఆమె అసహనంతో ఆయన చేతులను పక్కకు నెట్టేశారు.   చెరియన్ ఫిలిప్ ప్రవర్తనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన బిందు కృష్ణ వెంటనే సున్నితంగా ఆయనను దూరం  నెట్టి ముందుకు వెళ్లిపోయారు. ఆ సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆఫీస్ ముందు చాలా మంది ఉండగా ఎవరూ అడ్డుకోకపోగా నవ్వడం ఇప్పుడు మరిన్ని విమర్శలకు కారణం అవుతోంది. 
 
ఒక మహిళ ఎమ్మెల్యే పట్ల ఆ సీనియర్ నాయకుడు బహిరంగంగా, మీడియా, కెమెరాల ముందు ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా చెరియన్‌ ఫిలిప్‌ చర్యను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎమ్మెల్యే అసౌకర్యంగా ఫీలవుతున్నా ఫిలిప్‌ పట్టించుకోకుండా ఇదేం పనని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. సిగ్గులేకుండా ప్రవర్తించిన ఈ 71 ఏండ్ల నేతపై వెంటనే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని డిమాండ్‌ చేశారు.