ఈ ఏడాది మార్చిలో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం అరెస్టు చేసింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చిలో దక్షిణ బామునియా గ్రామంలో జరిగిన ఈ పేలుడులో నిందితుడి పాత్రపై కూలంకషంగా విచారణ జరిపిన అనంతరం, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బిజోయ్‌గంజ్ బజార్ ప్రాంతానికి చెందిన అహిదుల్ ఇస్లాం మొల్లాను అరెస్టు చేశారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసులు ఇంతకుముందే మరో నిందితుడిని అరెస్టు చేశారు.
బాంబుల తయారీ, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరాలలో అహిదుల్ ఇస్లాం సహ కుట్రదారుడని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్రలో భాగంగా బాంబులను తయారుచేస్తుండగా అవి పేలిపోవడంతో, ఈ నేరంలో పాల్గొన్న నిందితులలో ఒకరు మరణించారు.
ఇదిలా ఉండగా, శనివారం భాంగర్‌లో స్వాధీనం చేసుకున్న నాటు బాంబుల ఘటనపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏజెన్సీ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. శనివారం ఘటనా స్థలం నుంచి 79 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం కూడా తొమ్మిది బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, పేలుడు పదార్థాల స్వాధీనం విషయంలో ఎన్నికల సంఘం పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. తమ పరిధిలో ఏవైనా పేలుడు పదార్థాలు దొరికినా లేదా అలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడినా, సంబంధిత ఇన్‌చార్జ్ అధికారులు, ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్లు “అపూర్వమైన పరిణామాలను” ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదివారం ఈసీ పోలీసులను ఆదేశించింది.

More Stories
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు అంతంత మాత్రమే
కేరళలో ఎండలు ..సెల్ఫ్ లాక్ డౌన్ కు సీఎం పిలుపు
మాలేగావ్ పేలుళ్ల కేసులో నలుగురు నిందితులకు విముక్తి