ఉద్ధవ్‌ ‘సేన’లో మరోసారి చీలిక సంకేతాలు

ఉద్ధవ్‌ ‘సేన’లో మరోసారి చీలిక సంకేతాలు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే మరో చీలిక ఎదుర్కోనున్నట్లు కనిపిస్తున్నది. ఆయన పార్టీకి చెందిన కొందరు ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తున్నది. మరాఠ్వాడా ప్రాంతంలో ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేత, మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన సంజయ్ జాదవ్ ముంబైలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీలో జరిగిన కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు. 
 
అలాగే సేనా భవన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యవర్గ సభ్యుల మరో సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో సంజయ్ జాదవ్ గైర్హాజరు పార్టీ వర్గాల్లో ఆందోళనలు రేకెత్తించింది. అప్పటి నుంచి ఆయన అందుబాటులో లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   శివసేన (యూబీటీ)కి చెందిన హింగోలి నియోజకవర్గం ఎంపీ నాగేష్ పాటిల్ అష్టికర్, యవత్మల్-వషీం నియోజకవర్గం ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్ కలిసి ఇటీవల కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ ఢిల్లీలో ఇచ్చిన విందుకు హాజరయ్యారు.
ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను సంజయ్ జాదవ్ ఢిల్లీలో కలిసినట్లు వార్తలు వచ్చాయి.  దీంతో ఏదో రాజకీయ మంతనాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. మరోవైపు శివసేన (యూబీటీ) అగ్రనాయకత్వం, ఆ పార్టీ ఎంపీల మధ్య సమన్వయం లేనట్లు తెలుస్తున్నది. దీని పట్ల కొందరు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు ఇది కారణమని వారు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఈ ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు శివసేనను చీల్చిన మాదిరిగా నాలుగేళ్ల తర్వాత శివసేన (యూబీటీ)లో మరో చీలిక రావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.