కుకీ, నాగా తెగల మధ్య ఘర్షణలతో మణిపుర్‌లో మళ్లీ ఉద్రిక్తత!

కుకీ, నాగా తెగల మధ్య ఘర్షణలతో మణిపుర్‌లో మళ్లీ ఉద్రిక్తత!
మణిపుర్ లో మరోసారి హింస చెలరేగింది.  ఇంఫాల్‌లో మైతీ సామాజిక  ‘కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ’ (కోకోమీ) ఆధ్వర్యంలో శనివారం ఇంఫాల్‌లో పలుచోట్ల నిరసనకారులు భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఏప్రిల్ 7న బిష్ణుపూర్‌లో ఒక ఇంటిపై జరిగిన క్షిపణి దాడిలో ఇద్దరు మైతేయి పిల్లలు మరణించిన ఘటనకు నిరసనగా, మణిపూర్ మధ్య లోయ అంతటా వారం రోజులకు పైగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో శనివారం ఈ ర్యాలీ జరిగింది. 
 
ఈ నిరసనలలో చాలా వరకు భద్రతా సిబ్బందితో ఘర్షణలకు దారితీశాయి. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల నుంచి ర్యాలీ ప్రారంభమై, ముఖ్యమంత్రి బంగ్లా వైపు సాగాల్సి ఉంది.  అయితే, ముఖ్యమంత్రి బంగ్లా, ఇతర కీలక ప్రభుత్వ సంస్థలు ఉన్న ఇంఫాల్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతంలోకి నిరసనకారులు ప్రవేశించకుండా భద్రతా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో, నగరంలోని పలుచోట్ల ఉద్రిక్తతలు పెరిగాయి.
నిరసనకారులు రాళ్లు రువ్వడం, భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించడం వంటి ఘర్షణలు జరిగాయి.  ఈ ఘర్షణల్లో పలువురు నిరసనకారులు గాయపడినట్లు సమాచారం. మధ్యాహ్నం 1 గంట నుంచి మార్కెట్లు, వాణిజ్య సంస్థలు మూతపడటంతో ఇంఫాల్ వ్యాప్తంగా సాధారణ జనజీవనం స్తంభించింది. ఏప్రిల్ 7 దాడి జరిగిన వెంటనే ఒక గుంపు భద్రతా శిబిరంపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ముగ్గురు మరణించారు.
“స్థానభ్రంశం చెందిన ప్రజల పునరావాసం, సీఆర్పీఎఫ్ కాల్పులపై న్యాయ విచారణ, మాదకద్రవ్య ఉగ్రవాదంపై కఠిన చర్యలు వంటి పలు డిమాండ్లతో మా సంస్థ ప్రభుత్వానికి ఒక వినతిపత్రాన్ని సమర్పిస్తోంది. స్థానభ్రంశం చెందిన వారిని తిరిగి స్థిరపరుస్తామన్న గతంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదు. రాష్ట్రంలో జనాభా లెక్కలు లేదా ఎన్‌ఆర్‌సి వంటి ప్రక్రియలు జరగడానికి ముందే ఈ సమస్యను పరిష్కరించాలి” అని   కోకోమి ప్రతినిధి నహక్‌పామ్ శాంత స్పష్టం చేసారు. 
 
“చర్చల బల్లపై సంప్రదింపులు జరపడం తప్ప, శాంతిని నెలకొల్పడానికి వేరే మార్గం ఏదీ లేదు,” అని ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న అశాంతి వాతావరణం దైనందిన వేతన జీవులపై ప్రభావం చూపుతోందని, అలాగే రాష్ట్రంలోని పిల్లల విద్యా జీవితాలకు అంతరాయం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. “ప్రజలు, పౌర సమాజ సంస్థలు సహకరించకపోతే, కేవలం ప్రభుత్వం మాత్రమే శాంతిని తీసుకురాలేదు. రాష్ట్రంలోని అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొని, శాంతిని నెలకొల్పేందుకు మీరందరూ చర్చల బల్ల వద్దకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ఆయన పిలుపిచ్చారు.