ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య10 రోజుల కాల్పుల విరమణ

ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య10 రోజుల కాల్పుల విరమణ
 
లెబనాన్‌ ఇజ్రాయిల్‌ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం ప్రకటించారు. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, లెబనాన్‌ ప్రధానమంత్రి జోసెఫ్‌ ఔన్‌లతో మాట్లాడిన అనంతరం ట్రంప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం నుంచే ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపారు.
 
“రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు గురువారం సాయంత్రం 5 గంటలకు 10 రోజుల కాల్పుల విరమణను అధికారికంగా ప్రారంభించాలని ఇరుదేశాల నాయకులు అంగీకరించారు” అని తన ట్రూత్‌ సోషల్‌ మీడియాలో ట్రంప్‌ వెల్లడించారు. అయితే ట్రంప్‌ తన పోస్టులో లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గురించి ప్రస్తావించకపోవడం విశేషం. 
లెబనాన్‌ ప్రధానమంత్రి జోసెఫ్‌ ఔన్‌ కూడా ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు.
అలాగే, ట్రంప్‌ తన పోస్టులో ‘ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది యుద్ధాలను ఆపడం నాకు దక్కిన గౌరవం. ఇది పదవది. కాబట్టి దీన్ని కూడా పూర్తి చేద్దాం’ అని తెలిపారు. అలాగే, ఇజ్రాయెల్‌, లెబనాన్‌ దేశాలు 34 ఏళ్ల తరువాత తొలిసారిగా వాషింగ్టన్‌లో సమావేశమయ్యాయని ట్రంప్‌ చెప్పారు.  ఈ సమావేశం కోసం ఇరు దేశాలతో పని చేసే బాధ్యతలను ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ డాన్‌ కెయిన్‌లకు అప్పగించినట్లు కూడా ట్రంప్‌ తెలిపారు. 
 
ఈ చరిత్రాత్మక అడుగును పశ్చిమాసియాలో ప్రాంతీయ శాంతికి ఒక ముఖ్యమైన మైలురాయిగా ట్రంప్ అంతకు ముందు అభివర్ణించారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్టు ట్రూత్ సోషల్‌లో తెలిపారు. కాగా, ఇజ్రాయిల్‌తో లెబనాన్‌ ప్రభుత్వం శాంతి చర్చల్లో పాల్గొనడాన్ని హిజ్బుల్లా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్‌తో చర్చలు జరపాలని లెబనాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ‘ఒక ఘోరమైన తప్పిదం’ అని హిజ్బుల్లా చట్ట సభ్యుడు హుస్సేన్‌ హజ్‌ హసన్‌ విమర్శించారు. 

మరోవంక, శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోతే అనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ను అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ మరోసారి హెచ్చరించారు. ‘ఇరాన్‌ విద్యుత్‌ మౌలిక సదుపాయాలపై దాడి చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు. ‘ఇరాన్‌ కనుక తెలివితక్కువ నిర్ణయం తీసుకుంటే దాని మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, ఇంధన రంగాలపై దిగ్బంధనం, బాంబుల వర్షం కురుస్తుంది’ అని హెగ్సెత్‌ తెలిపారు.