కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ విద్యావేత్త అశోక్ కుమార్ మిట్టల్ లక్ష్యంగా మంగళవారం దాడులు నిర్వహించారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న అశోక్ మిట్టల్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు వ్యాపార సంస్థల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి.
లవ్లీ గ్రూప్ అధిపతిగా ఉన్న మిట్టల్ ఒక ప్రముఖ యూనివర్సిటీని కూడా నిర్వహిస్తున్నారు. విదేశీ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే అనుమానంతో అధికారులు కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. అశోక్ మిట్టల్‌పై ఈడీ దాడులు జరగడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తడానికి తమ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా భయపడుతున్నారనే కారణంతో ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను రాజ్యసభలో తమ పార్టీ ఉపనేత స్థానం నుంచి తొలగించింది. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ కుమార్ మిత్తల్‌ను నియమించింది. ఈ నియామకం జరిగిన కొద్ది రోజులకే ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. జలంధర్, చండీగఢ్ విభాగాలకు చెందిన ఈడీ అధికారులు ఈ సోదాల్లో పొల్గొన్నారు.
ఈడీ చర్యకు గట్టి ప్రతిస్పందన ఇస్తామని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శపథం చేశారు. “మోదీజీ పంజాబ్‌లో ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభించారు. కానీ పంజాబ్ ప్రజలు దీనిని సహించరు. వారు బీజేపీకి తగిన జవాబు ఇస్తారు,” అని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ, మిట్టల్‌పై దాడులు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ పన్నిన ఎత్తుగడ అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు.
“పంజాబ్ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇల్లు, విశ్వవిద్యాలయంపై ఈడీ దాడులు… ఇది మామూలు మోదీ శైలి,” అని మాన్ ‘ఎక్స్ లో ఒక పోస్ట్‌లో రాశారు. “మనం కొమ్మల నుండి రాలిపడే ఆకులం కాదు, తుఫానులను వాటి హద్దుల్లోనే ఉండమని చెప్పండి,” అని ఆయన కవితాత్మకంగా చమత్కరించారు.

More Stories
బంగారం, వెండిపై భారీగా పెంచిన దిగుమతి సుంకం
ప్రధాని పొదుపు చర్యలకు స్వదేశీ జాగరణ్ మంచ్ మద్దతు
ఇక వారానికి 48 గంటలే పని.. ఓవర్‌టైమ్ కు అదనం