మార్చిలో రష్యా నుంచి భారత్ చేసుకున్న ముడి చమురు కొనుగోలు మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఫిబ్రవరిలో కాస్త తగ్గుముఖం పట్టిన రష్యా చమురు దిగుమతులు, మార్చి నాటికి మళ్లీ పుంజుకున్నాయి. మార్చిలో రష్యా నుంచి శిలాజ ఇంధనాలను అత్యధికంగా కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో భారత్ చమురు దిగుమతులు 4 శాతం తగ్గడం గమనార్హం.
మార్చిలో ఏకంగా 5.8 బిలియన్ యూరోలవిలువైన రష్యన్ హైడ్రోకార్బన్‌లను భారత్ దిగుమతి చేసుకుంది. ఇందులో కేవలం ముడి చమురు వాటానే 91 శాతంగా, అంటే సుమారు 5.3 బిలియన్ యూరోలుగా ఉంది. మిగిలిన వాటిలో బొగ్గు 337 మిలియన్ యూరోలు ఉండగా, ఇతర చమురు ఉత్పత్తులు 178.5 మిలియన్ యూరోలు ఉన్నాయి. ఫిబ్రవరిలో చూసుకుంటే, ఈ మొత్తం కొనుగోళ్లు 1.8 బిలియన్ యూరోలుగా మాత్రమే ఉండగా, మార్చి నాటికి అవి భారీగా పెరిగాయి.
“మార్చి 2026లో రష్యా శిలాజ ఇంధనాలను అత్యధికంగా కొనుగోలు చేసిన దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మొత్తం 5.8 బిలియన్ యూరోల విలువైన రష్యన్ హైడ్రోకార్బన్‌లను దిగుమతి చేసుకుంది. భారతదేశం కొనుగోళ్లలో 91 శాతం ముడి చమురు ఉత్పత్తులే ఉన్నాయి, వీటి మొత్తం విలువ 5.3 బిలియన్ యూరోలు,” అని అది పేర్కొంది.
ఇరాన్‌పై వాషింగ్టన్ యుద్ధం ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో ధరలను అదుపు చేయడానికి, రష్యా చమురుపై అమెరికా ఒక నెల పాటు ఆంక్షల సడలింపు ఇచ్చింది. సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గోలకు, అలాగే గతంలో ఆంక్షలు విధించిన నౌకలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. దీని వల్ల అంతకుముందు రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసిన మన దేశ ప్రభుత్వ రంగ రిఫైనరీలు, మళ్లీ కొనుగోళ్లను భారీగా ప్రారంభించాయి.
ప్రభుత్వ రంగ రిఫైనరీల దిగుమతుల్లో నెలకు నెల ఏకంగా 148 శాతం భారీ పెరుగుదల కనిపించింది. గత నవంబర్ చివరలో రష్యా దిగుమతులను నిలిపివేసిన మంగళూరు, విశాఖపట్నం రిఫైనరీలు సైతం మార్చిలో మళ్లీ చమురు కొనుగోళ్లను పునరుద్ధరించాయి. పశ్చిమదేశాల ఆంక్షల నేపథ్యంలో చమురు అమ్మకాల కోసం రష్యా ఆసియా మార్కెట్లపైనే తీవ్రంగా ఆధారపడుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రష్యా ఎగుమతి చేసిన ముడి చమురులో 90 శాతం కేవలం చైనా, భారత్‌లకే చేరడం విశేషం.
మార్చి నెల గణాంకాలను పరిశీలిస్తే, రష్యా ముడి చమురు ఎగుమతుల్లో సగానికి పైగా, అంటే 51 శాతాన్ని చైనా కొనుగోలు చేసింది. ఆ తర్వాత భారత్ 38 శాతం, తుర్కియే 6 శాతం, యూరోపియన్ యూనియన్ 1.8 శాతం వాటాలను తీసుకున్నాయి. రష్యా చమురును శుద్ధి చేసే రిఫైనరీల నుంచి వచ్చిన 14 ఇంధన నౌకలు మార్చిలో యూరప్ పోర్టుల్లో అన్‌లోడ్ అయ్యాయి. ఇందులో భారత్ నుంచి 4, తుర్కియే నుంచి 9 నౌకలు ఉన్నాయి.
ముఖ్యంగా మార్చి నెలలో రష్యన్ క్రూడ్‌ను ప్రాసెస్ చేసే భారత్, తుర్కియే, బ్రూనై తదితర దేశాల రిఫైనరీలు సుమారు 830 మిలియన్ యూరోల ఇంధన ఉత్పత్తులను పశ్చిమ దేశాలకు ఎగుమతి చేశాయి. ఇందులో 304 మిలియన్ యూరోల ఇంధనం ఈయూకి, 168 మిలియన్ యూరోల ఇంధనం అమెరికాకు ఎగుమతి అయ్యింది. అమెరికాకు వెళ్లిన ఈ ఇంధన ఉత్పత్తులు భారతదేశంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీతో పాటు తుర్కియేలోని స్టార్ రిఫైనరీల నుంచే వెళ్లాయని సీఆర్ఈఏ నివేదిక స్పష్టం చేసింది.

More Stories
నాలుగేళ్ళలో తొలిసారిగా డీజిల్ ధర పెంపు తప్పదా?
అమెరికా, ఇరాన్ రెండో దశ చర్చలపై అనిశ్చితి
భారత- శ్రీలంక ఒప్పంద స్ఫూర్తిని గుర్తు చేసిన శ్రీలంక తమిళ పార్టీలు