కాల్పుల విరమణకు ఇరాన్ విముఖత…యుద్ధ విరమణ జరగాలి!

కాల్పుల విరమణకు ఇరాన్ విముఖత…యుద్ధ విరమణ జరగాలి!
అమెరికా నుంచి వచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్‌ సోమవారం తిరస్కరించింది. తన ప్రతిస్పందనను పాకిస్థాన్‌ ద్వారా అమెరికాకు తెలియచేసినట్లు ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ న్యూస్‌ ఏజెన్సీ(ఇర్నా) తెలిపింది. తాత్కాలిక ఒప్పందానికి ఇరాన్‌ ఇష్టపడడం లేదని, యుద్ధానికి శాశ్వత ముగింపు అవసరమని స్పష్టం చేస్తున్నట్లు ఇరాన్‌ స్పందన తెలియచేస్తున్నది. 
 
ఇరాన్‌ తన సమాధానంలో తక్షణ కాల్పుల విరమణతోపాటు 10 నిబంధనల ప్రణాళికను పొందుపరిచింది. ఇందులో పశ్చిమాసియా ప్రాంతమంతటా ఘర్షణలను అంతం చేయడం, హొర్ముజ్‌ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి భరోసా ఇచ్చే నిబంధనలు అమలుచేయడం, ఇరాన్‌ పునర్నిర్మాణానికి సంబంధించిన ఆంక్షలు, నిబంధనలు ఎత్తివేయడం వంటి డిమాండ్లు ఉన్నాయి. 
 
హర్మూజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలను టెహ్రాన్​ తోసిపుచ్చింది. ట్రంప్ చేసిన అవివేకపు బెదిరింపులకు తమపై ఎలాంటి ప్రభావం చూపవని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై తమ దాడులు కొనసాగుతాయని ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి ఘాటుగా హెచ్చరించారు.
 
తాత్కాలిక కాల్పుల విరమణకు ప్రతిగా హార్మూజ్‌ను తిరిగి తెరిచే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. శాశ్వతంగా యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా సంసిద్ధంగా లేదని ఇరాన్‌ భావిస్తోందని పేర్కొన్నారు. తాము కేవలం కాల్పుల విరమణను మాత్రమే ఆమోదించబోమని కైరోలోని ఇరాన్‌ దౌత్య కార్యాలయ అధిపతి మొజ్తబా ఫిర్దౌసీ పోర్‌ తెలిపారు. ఇరాన్‌పై మళ్లీ దాడి జరగదన్న హామీలతో కూడిన యుద్ధ ముగింపును తాము ఆమోదిస్తామని ఆయన స్పష్టం చేశారు.  గడువులోగా ఒప్పందానికి అంగీకరించకపోతే ఇంధన, మౌలిక సదుపాయాలను బాంబులతో పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ నుంచి ఈ స్పందన వెలువడింది.

కాగా, పాకిస్థాన్‌ బలపరుస్తున్న కాల్పుల విరమణ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉన్న అనేక ఆలోచనలలో ఒకటని వైట్‌ హౌస్‌ అధికారి ఒకరు సీబీఎస్‌ న్యూస్‌కు తెలిపారు. అయితే అధ్యక్షుడు ట్రంప్‌ దీనికి ఆమోదం తెలపలేదని, ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సమాచార మార్పిడి మార్గాలను తెరచి ఉంచడానికి పాకిస్థాన్‌ తెరవెనుక నుండి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నది. 

పాకిస్థాన్‌తోపాటు ఈజిప్టు, తుర్కియే కూడా ట్రంప్‌ దూత స్టీవ్‌ విట్కాఫ్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ మధ్య ప్రత్యక్ష సందేశాల మార్పిడికి దోహదపడుతున్నాయి. తన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్‌ తిరస్కరించడంపై తాను చాలా కలత చెందానని ట్రంప్ తెలిపారు. ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమైన పక్షంలో ఇరాన్‌ భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తూ  యావత్‌ ఇరాన్‌ మొత్తాన్ని ఒక్క రాత్రిలో నాశనం చేయగలమని, అది కూడా మంగళవారం సాయంత్రమే కావొచ్చని పేర్కొన్నారు. ఇరాన్‌కు విధించిన మంగళవారం గడువులో ఎటువంటి మార్పు ఉండబోదని, అదే ఫైనల్‌ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. 

వారు చేయాల్సింది చేస్తే ఇది(యుద్ధం) చాలా త్వరగా ముగిసిపోవచ్చు అని ఇరాన్‌ని ఉద్దేశించి ట్రంప్‌ చెప్పారు.  కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిర్దంద్వంగా తిరస్కరించిన ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ అమెరికా, దాని మిత్ర దేశాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమపై రోజురోజుకూ దాడులు తీవ్రమవుతుండడాన్ని ఆయన ప్రస్తావిస్తూ బెదిరింపులు, దాడులు, ఐఆర్‌జీసీ కమాండర్లు లక్ష్యంగా హత్యలు ఇరాన్‌ సైనిక బలగాలను బలహీనపర్చ లేవని స్పష్టం చేశారు. 

ఇరాన్‌ను రాతియుగానికి పంపుతామంటూ ట్రంప్‌ చేసిన హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు. అది అతని నిర్లక్ష్య వైఖరిని చూపుతున్నదని విమర్శించారు. యూఎస్‌, ఇజ్రాయెల్‌ దళాలు పౌరుల మౌలిక సదుపాయాలైన స్కూళ్లు, బ్రిడ్జిలు, పవర్‌ ప్లాంట్లు లక్ష్యంగా దాడులు చేస్తూ తమపై ఒత్తిడి చేస్తున్నా ఇరాన్‌ మిలిటరీ బలం ఏ మాత్రం చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. మానవత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. 

మరోవంక, యుద్ధంలో అమెరికాకు సహకరించని మిత్రదేశాలపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, నాటో దేశాలు సహాయం చేయలేదని విమర్శించారు. ఉత్తర కొరియా నుంచి రక్షించడానికి జపాన్‌లో 50వేల మందిని, దక్షిణ కొరియాలో 45వేల మంది సైనికులను అమెరికా మోహరించిందని వివరించారు. అయితే సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ దేశాలు సహకరించాయని ప్రశంసించారు.