కాంగ్రెస్‌ పార్టీకి పాకిస్థాన్‌తో దోస్తీ

కాంగ్రెస్‌ పార్టీకి పాకిస్థాన్‌తో దోస్తీ

కాంగ్రెస్‌ పార్టీకి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ  మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ దేశ భద్రతపై ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరుకు ఇప్పటికే పలుమార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. ఆపరేషన్‌ సింధూర్‌  సమయంలో కూడా కాంగ్రెస్‌ పార్టి పాకిస్థాన్‌ పాటే పాడిందని గుర్తు చేశారు. 

కాంగ్రెస్, పాకిస్థాన్‌ సంబంధం ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచో సాగుతున్నదని పేర్కొంటూ ఇది జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమని ప్రధాని హెచ్చరించారు. ఆదివారం ఢిల్లీలో పవన్‌ ఖేరా, గువాహటిలో గౌరవ్‌ గొగోయ్‌ రెండు వేర్వేరు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారని, ఆ కాన్ఫరెన్స్‌కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని పాకిస్థాన్‌ సామాజిక మాధ్యమాల నుంచి తీసుకున్నట్టు తాము గుర్తించామని ఆయన విమర్శించారు.

అస్సాం ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పాకిస్థాన్‌ ఛానల్‌ 11 టాక్‌ షోలను నిర్వహించిందని చెబుతూ ఇలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదని ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. ప్రతి షోలోనూ చివరకు కాంగ్రెస్‌ గెలవాలని చెప్పారని ప్రధాని తెలిపారు. ఆదివారం జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లలో పాకిస్థాన్‌ జోక్యం స్పష్టంగా వెల్లడైందని ఆయన స్పష్టం చేశారు.

అసోంలో చొరబాటుదారులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని, అక్రమ భూఆక్రమణలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అడ్డుకుంటోందని ప్రధాని ఆరోపించారు. చొరబాటుదారులను ‘బాధితులు’గా పరిగణించే చట్టాలను తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దీని ద్వారా స్వదేశీ ప్రజలు ప్రమాదంలో పడుతుందని మోదీ హెచ్చరించారు. 

“బీజేపీ అసోంలోని అక్రమ భూఆక్రమణలను అరికట్టాలని చూస్తోంది. కానీ కాంగ్రెస్ బహిరంగంగానే చొరబాటుదారులకు మద్దతు ఇస్తుంది. పైగా అక్రమ ఆక్రమణలకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తోంది” అని ప్రధాని విమర్శించారు. 

“అసోంలో కాంగ్రెస్ ఎలాంటి చట్టాన్ని తీసుకురావాలని అనుకుంటోందంటే, ఎవరైనా చొరబాటుదారుడు అనే పదాన్ని ఉపయోగిస్తే, వారు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే చొరబాటుదారులను ‘బాధితులు’గా పరిగణిస్తుంది. దీని వల్ల మెజారిటీ స్వదేశీ ప్రజలు జైలు శిక్ష ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది” అని మోదీ స్పష్టం చేశారు. 

అసోం సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని నొక్కి చెబుతూ, బోడో సామాజిక వర్గానికి చెందిన ‘హుదుమ్ పూజ’, కోచ్-రాజ్బోంగ్షి వర్గానికి చెందిన ‘బాతౌ’ అనేవి అసోం సంస్కృతి, ప్రకృతి, విశ్వాసాల మధ్య ఉన్న సామరస్యానికి ఉదాహరణలుగా ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ అధికారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, అందువల్ల అసోం సంప్రదాయాలకు గొప్ప నష్టం వాటిల్లిందని ఆయన ధ్వజమెత్తారు. 

కాగా, మహిళా రిజర్వేషన్ల వల్ల ఏ రాష్ట్ర ప్రాతినిధ్యానికీ భంగం వాటిల్లదని ప్రధాని హామీ ఇచ్చారు. అందువల్ల అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో అమలులో ఉన్న జనాభా నియంత్రణ చర్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.