మాల్దా నిర్భంధం ప్రధాన సూత్రధారి మొఫక్కురల్‌ ఇస్లాం అరెస్ట్

మాల్దా నిర్భంధం ప్రధాన సూత్రధారి మొఫక్కురల్‌ ఇస్లాం అరెస్ట్
బంగాల్‌లోని మాల్దాలో ఎస్ఐఆర్ లో పాల్గొన్న న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనలో ప్రధాన సూత్రధారి మొఫక్కురల్‌ ఇస్లాం సహా అతడి సహాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాది మొఫక్కురల్‌ ఇస్లాం విమానం ఎక్కి పారిపోయేందుకు బగ్డోగ్రా విమానాశ్రయానికి వెళ్లిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు.  స్థానికులను ప్రసంగాలతో రెచ్చగొట్టి ఏడుగురు అధికారుల నిర్బంధానికి కారణమైన ఇస్లాంపై మూడు కేసులు నమోదు చేశారు.
మొత్తంగా ఈ ఘటనపై 19 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్ఐఏ ఈ కేసును విచారిస్తున్నప్పటికీ తాము కూడా దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించారు. అధికారుల నిర్బంధం పక్కా ప్రణాళికతో చేశారా లేదా అన్న కోణంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.  మోతాబరి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ సభ్యుడు మౌలానా షాజహాన్ అలీతో పాటు ఈ కేసులో ఇప్పటివరకు 35 మందిని అరెస్టు చేశారు. అటు మాల్దా హింసాకాండ కేసుపై ఎన్ఐఏ కూడా దర్యాప్తు ప్రారంభించింది.  కోల్‌కతా కార్యాలయం నుంచి ఎన్ఐఏ బృందం మాల్దాకు బయలుదేరింది. ముందుగా పోలీసుల నుంచి అన్ని వివరాలను సేకరించే అవకాశం ఉంది.

మరోవైపు ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. అధికారుల నిర్బంధం ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దీని వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘం కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం పన్నుతున్న వ్యూహంలో భాగంగానే ఈ అలజడిని సృష్టిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 

ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక తన అధికారాలు తగ్గిపోయాయని, అందుకే యంత్రాంగంపై పట్టు కోల్పోయానని మమతా వివరించారు. బోగస్ ఓటర్లను తొలగిస్తుండటంతో భయం పట్టుకున్న టీఎంసీ, ఉద్దేశపూర్వకంగానే ఈ అరాచకానికి పాల్పడిందని బీజేపీ విమర్శించింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో, మాల్దాతో పాటు జల్పాయ్‌గుఢి, కూచ్ బెహర్, పూర్బా బర్ధమాన్ వంటి జిల్లాల్లో కూడా నిరసనలు మిన్నంటాయి. 

ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఓటర్ల సవరణ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అంతుకుముందు బంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తుంది.  ఓటర్ల జాబితా నుంచి అసలైన పేర్లను తొలగిస్తున్నారనే ఆగ్రహంతో ముగ్గురు మహిళా అధికారులతో సహా ఏడుగురిని 9 గంటల పాటు నిరసనకారులు బందీలుగా ఉంచారు. జాతీయ రహదారిని దిగ్బంధించడమే కాకుండా, అధికారులను విడిపించడానికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేసేందుకు యత్నించారు